
మోదీ లండన్ వెళ్లాక ఈమెయిల్స్ తొలగింపు
ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ వ్యవహారంలో మరో అంశం వెలుగు చేసింది.
న్యూఢిల్లీ: ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ వ్యవహారంలో మరో అంశం వెలుగు చేసింది. 2010లో మోదీ లండన్ వెళ్లిపోయాక ఆయన సెక్రటరీ దీపా పాలేకర్.. మోదీకి సంబంధించిన ఈమెయిల్స్ అన్నింటినీ తొలగించారు. ఐపీఎల్, వ్యాపార లావాదేవీలు, రాజకీయ ప్రముఖులతో మోదీకి సంబంధించిన ఈమెయిల్స్ అన్నింటినీ మాయం చేశారు. దీపకు 8 ఈమెయిల్ ఎకౌంట్లు ఉండేవి. 2010 తర్వాత కమ్యూనికేషన్స్ కోసం ఓ ఈమెయిల్ ఎకౌంట్ను వాడుకుని మిగిలినవి తొలగించారని ఐటీ విచారణలో వెల్లడైంది.
మోదీ వ్యాపారాలన్నింటినీ దీపనే చూసేవారు. మోదీకి సెక్రటరీనే గాక ఆయనకు చెందిన 9 కంపెనీల్లో డైరెక్టర్గా ఉన్నారు. ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాక మోదీ లండన్ వెళ్లారు. ఆ తర్వాత ఆదాయపన్ను శాఖ ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసింది. ఐటీ అధికారులు ఈమెయిల్స్ విషయంపై దీపను ప్రశ్నించగా.. పని పూర్తయినందున వీటిని తొలగించినట్టు చెప్పారు. ఇతర ఈమెయిల్స్ ఎకౌంట్లు కంప్యూటర్లో సమస్య కారణంగా తొలగిపోయానని దీప తెలిపారు. ఐపీఎల్ వ్యవహారాలు సహా 2010కి ముందు మోదీకి సంబంధించిన ఈమెయిల్స్ తన వద్ద లేవని దీప చెప్పారు.