
ఎయిరిండియా విమానానికి తప్పిన ముప్పు
కోల్కతా: పైలట్ సకాలంలో స్పందించడంతో ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం తప్పింది. ఇంజిన్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో కోల్కతా- కాట్మాండు ఎయిర్ ఇండియా విమానం బుధవారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎయిర్ పోర్టులో అత్యవసరంగా దిగింది. ఉదయం 8.31 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 56 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బందితో 8.18 గంటలకు పైకి ఎగిరిన విమానం కొద్దిసేపటికే కిందకు దిగింది.
కుడివైపు ఇంజిన్ లో సాంకేతిక లోపం తలెత్తిందని పైలట్ సమాచారం అందించడంతో విమానాన్ని అత్యవసరంగా కిందకు దించినట్టు ఎయిర్ ఇండియా అధికారి ఒకరు తెలిపారు. విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా ఉన్నారని చెప్పారు. మరో విమానంలో వీరిని పంపించినట్టు వెల్లడించారు. సాంకేతిక లోపాన్ని సరిచేసేందుకు నిపుణులు ప్రయత్నిస్తున్నారన్నారు.