ఆగిపోయిన ఏసీ.. విమానంలో ఉక్కిరిబిక్కరి
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణీకులంతా గోల చేశారు. దాదాపు ఆందోళనకు దిగినంత పనిచేశారు. అందుకు కారణం విమానంలో ఎయిర్ కండిషన్ వ్యవస్థ ఆగిపోవడమే ఇందుకు కారణమైంది. అయితే, చివరకు విమానం ఎలాంటి ప్రమాదం లేకుండానే సురక్షితంగా దిగింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం 168మంది ప్రయాణీకులతో ఏఐ-880 విమానం పశ్చిమ బెంగాల్‌లోని బగ్దోగ్రా నుంచి ఢిల్లీకి బయల్దేరగా అనూహ్యంగా ఏసీ ఆగిపోయింది. అయితే, కంగారు పడాల్సిన పని లేదని, వెంటనే వస్తుందని చెప్పారు. కానీ, అలా జరగలేదు. దీంతో సరిగా ఊపిరి ఆడక తీవ్ర ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు.
ఆక్సిజన్ మాస్కులు పెట్టుకున్నా అవీ పనిచేయలేదు. దీంతో ప్రయాణీకులంతా విమానంలో ఇచ్చిన వార పత్రికలను తీసుకొని విసనకర్రల మాదిరిగా ఉపయోగించుకోవడం మొదలుపెట్టారు. కోపంతో సిబ్బందిపై అరవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో కొంతమంది వీడియోలు తీస్తుండగా అలా చేయొద్దంటూ సిబ్బంది ఫోన్‌లు లాక్కునే ప్రయత్నం చేశారు. ఇదే విషయంపై ఎయిర్ ఇండియాను ప్రశ్నించగా సాంకేతిక లోపం కారణంగా ఈ సమస్య తలెత్తిందని, విచారణకు ఆదేశించామని చెప్పారు.