'క్షణాల్లో నిండు ప్రాణం కాపాడాడు'
ముంబయి: ఓ వ్యక్తి అప్రమత్తత మరో వ్యక్తిని ఎప్పుడూ కాపాడుతుందంటారు. మహారాష్ట్రలో సరిగ్గా అదే విషయం రుజువైంది. విధుల్లో ఉన్న ఓ రైల్వే కానిస్టేబుల్ అప్రమత్తంగా ఉండటంతో ఓ ప్రయాణీకుడి ప్రాణాలుపోకుండా కాపాడాడు. ప్రమాదవశాత్తు రైలు కిందపడిపోతున్న అతడిని ఎంతో సాహసంతో రక్షించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. చంద్రకాంత్ రప్దే అనే వ్యక్తి ఆర్పీఎఫ్ కానిస్టేబుల్గా కజ్రాత్ రైల్వే స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నాడు.
సరిగ్గా 2గంటల ప్రాంతంలో రైలు నెంబర్ 16339 సీఎఎస్టీ-నాగర కోయిల్ ఎక్స్ ప్రెస్ రైలు ఫ్లాట్ ఫాం నెంబర్ 1 వద్దకు వచ్చి ఆగింది. అందులో ప్రయాణీస్తున్న పాండా అనే వ్యక్తి స్టేషన్లో పండ్లు కొనుగోలు చేసేందుకు దిగాడు. అనంతరం వాటిని తీసుకొని వస్తుండగా రైలు నెమ్మదిగా కదలడం ప్రారంభించింది. దీంతో అతడు కంగారులో రైలు ఎక్కే ప్రయత్నం చేసి అదుపుతప్పాడు.
కాళ్లు జారి ప్లాట్పాంకు రైలుకు మధ్యలో ఇరుక్కుపోయాడు. అప్పుడు అక్కడే అప్రమత్తంగా ఉన్న ఆర్పీఎఫ్ అధికారి చంద్రకాంత్ శరవేగంగా స్పందించి అతడి చేతులను అందుకుని అమాంతం బయటకు లాగడంతో స్వల్పగాయాలతో అతడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ వీడియో మొత్తం సీసీటీవీలో రికార్డయి ప్రస్తుతం ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది.