జయప్రద, అమర్‌లకు ఎంపీ టికెట్ల ఖరారు
లక్నో: రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్‌ఎల్‌డీ)లో చేరిన సమాజ్‌వాదీ పార్టీ బహిష్కృత నేతలు అమర్‌సింగ్, జయప్రదలకు లోక్‌సభ టికెట్లు ఖరారయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ సిక్రీ నుంచి అమర్, బిజ్‌నూర్ నుంచి జయ పోటీలో దిగనున్నారు. ఆర్‌ఎల్‌డీ అధినేత అజిత్‌సింగ్ బాగ్‌పత్ నుంచి బరిలో దిగుతుండగా, ఆయన తనయుడు జయంత్ చౌధురి మథుర నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. కాంగ్రెస్‌తో జతకట్టిన ఆర్‌ఎల్‌డీకి సర్దుబాటులో భాగంగా యూపీలో ఆరు సీట్లు వచ్చాయి. దీంతో ఆయా నియోజకవర్గాల నుంచి పోటీచేసే అభ్యర్థుల జాబితాను ఆర్‌ఎల్‌డీ మంగళవారం ప్రకటించింది.
‘చాయ్ పే చర్చా’లో ఉచిత టీలు ఇవ్వొద్దు!
లక్నో: ముందస్తుగా తగిన అనుమతి తీసుకున్న తర్వాతే ‘చాయ్ పే చర్చా’ కార్యక్రమాన్ని నిర్వహించాలని, ఆ కార్యక్రమం సందర్భంగా ఎన్నికల కోడ్‌ను అతిక్రమించేలా ప్రజలకు ఉచితంగా టీలు ఇవ్వొద్దని మంగళవారం బీజేపీకి ఎన్నికల సంఘం స్పష్టంచేసింది. ఈసీ మార్గదర్శకాల ప్రకారం.. జిల్లా ఎన్నికల అధికారుల నుంచి అనుమతి తీసుకున్నాకే చాయ్ పే చర్చా నిర్వహించాలని యూపీ ముఖ్య ఎన్నికల అధికారి ఉమేశ్ సిన్హా తెలిపారు. కార్యక్రమంలో పాల్గొనేవారి నుంచి చాయ్‌కి డబ్బులు వసూలు చేయాలన్న షరతుతోనే సంబంధిత అధికారులు అనుమతి జారీ చేస్తారన్నారు. చాయ్ పే చర్చాలో చాయ్‌కి అందరితోనూ డబ్బులు వసూలు చేస్తామని బీజేపీ యూపీ అధ్యక్షుడు లక్ష్మీకాంత్ బాజ్‌పాయ్ హామీనిచ్చారని చెప్పారు.
ఉద్ధవ్ ఠాక్రేకు మోడీ బుజ్జగింపు
ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎమ్మెన్నెస్)తో దోస్తీకి బీజేపీ అర్రులు చాస్తుండడంపై భగ్గుమంటున్న ఎమ్మెన్నెస్ బద్ధశత్రువు శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేను ప్రసన్నం చేసుకోవడానికి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ రంగంలోకి దూకారు. ఉద్ధవ్ కు ఆయన మంగళవారం రాత్రి ఫోన్ చేసి బుజ్జగించారు. ‘సేన బీజేపీకి పాత, నమ్మకమైన నేస్తం. పాతికేళ్ల మన బంధం బలమైంది’ అని మోడీ చెప్పినట్లు శివసేన వర్గాలు తెలి పాయి. ప్రస్తుత పరిణామాలపై ఆందోళనపడాల్సి అవసరం లేదని అన్నారన్నాయి.
రాజకీయ పార్టీలపై ఎనిమిది కేసులు
న్యూఢిల్లీ: ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినందుకు వివిధ రాజకీయ పార్టీలపై ఇప్పటి వరకు 8 ఎఫ్‌ఐఆర్‌లు దాఖలయ్యాయని ఎన్నికల సంఘం(ఈసీ) వెల్లడించింది. లోక్‌సభ ఎన్నికలకు ఈ నెల 5న షెడ్యూల్ విడుదలతో ఎన్నికల నియమావళి అదే రోజు నుంచి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కోడ్‌ను ఉల్లంఘించాయంటూ కాంగ్రెస్‌పై ఒకటి, ఇతర పార్టీలపై ఏడు ఎఫ్‌ఐఆర్‌లు దాఖలయ్యాయని ఈసీ నోడల్ అధికారి ఒకరు తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీలపై ఒక్క ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు కాలేదని చెప్పారు. ఢిల్లీలోని ఏడు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 72 తుపాకులు, పెద్ద మొత్తంలో లిక్కర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
మూడో కూటమికి మద్దతు: కరుణ
చెన్నై, సాక్షి : రాహుల్‌గాంధీ, నరేంద్రమోడీ లేని మూడో లౌకికవాద కూటమికి డీఎంకే మద్దతిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు కరుణానిధి స్పష్టం చేశారు. వంద అంశాలు, హామీలతో కూడిన ఎన్నికల మేనిఫెస్టోను మంగళవారం ఆయన ఇక్కడ విడుదల చేశారు. కచ్చదీవుల సాధన, సేతు సముద్ర పథకం పూర్తి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం మహిళా రిజర్వేషన్, పది లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు, ఈలం తమిళుల సమస్యపై ప్రజాభిప్రాయ సేకరణ, ఉరిశిక్ష రద్దు, మద్రాస్ హైకోర్టులో తమిళ భాష అమలు, నదుల అనుసంధానం వంటి వంద హామీలను మేనిఫెస్టోలో పేర్కొన్నారు.
76 మంది ఎంపీలపై తీవ్ర నేరాభియోగాలు
న్యూఢిల్లీ: ప్రస్తుత లోక్‌సభ సభ్యుల్లో 76 మంది తీవ్రమైన నేరాభియోగాలను ఎదుర్కొంటున్నారని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం(ఏడీఆర్), జాతీయ ఎన్నికల నిఘా సంస్థ(ఎన్‌ఈడబ్ల్యూ) వెల్లడించాయి. 2009లో లోక్‌సభకు ఎన్నికైన నేతల్లో 162 మంది 306 క్రిమినల్ కేసుల్లో నిందితులుగా ఉండగా.. వారిలో 76 మంది హత్య, అపహరణ వంటి తీవ్ర నేరాల్లో నిందారోపణలను ఎదుర్కొంటున్నట్లు ఈ సంస్థలు తెలిపాయి. ఎంపీలు, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసుల్లో అభియోగాలు నమోదైతే.. ఏడాదిలోగా విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన మరుసటి రోజే ఈ సంస్థలు నేతలపై కేసుల వివరాలను బయటపెట్టడం గమనార్హం.
పెరుగుతున్న ఎన్నికల వ్యయం!
సాక్షి, న్యూఢిల్లీ: పెరుగుతున్న పార్టీల సంఖ్య, స్వతంత్ర అభ్యర్థుల సంఖ్య, జనాభాకు తగిన సంఖ్యలో ఏర్పాటు చేస్తున్న పోలింగ్ బూత్‌లు.. ఓటరు చైతన్య కార్యక్రమాలు.. వెరసి ప్రభుత్వానికి ఎన్నికల వ్యయం నానాటికీ పెరుగుతోంది. దీంతో సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో ఓటరు తలసరి వ్యయం పైసలు దాటి రూపాయిలకు చేరింది. దేశంలో తొలిసారి ఎన్నికలు జరిగిన 1951-52 నుంచి 2009లో జరిగిన 15వ లోక్‌సభ ఎన్నికల వరకు ప్రభుత్వ ఖర్చు పరిశీలిస్తే ఓటరు తలసరి వ్యయం 20 రెట్లు పెరిగింది. పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, సిబ్బందికి వేతనాలు, రవాణా, ఇతరత్రా ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. 1951-52లో తొలి లోక్‌సభ ఎన్నికల్లో ఒక ఓటరుకు 60 పైసలు వ్యయం చేయగా, 2009 నాటి ఎన్నికల్లో ఈ వ్యయం రూ.12కు చేరింది. 1951-52లో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం రూ.10.45కోట్లు వ్యయం చేయగా, 2009లో రూ.846.67 కోట్లు వ్యయం చేసింది.
ఎలక్షన్ వాచ్...
Published Wed, Mar 12 2014 5:35 AM | Last Updated on Sat, Mar 9 2019 3:34 PM
Advertisement
Advertisement