
ఇక అమెజాన్ లో అవి కూడా...
ఆన్ లైన్ వ్యాపార సంస్థ అమెజాన్ చేనేత రంగ ఉత్పత్తులను విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వ చేనేత అభివృద్ధి కమిషనర్ తో ఒక ఒప్పందాన్ని చేసుకుంది.
బెంగళూరు: ప్రముఖ ఆన్ లైన్ వ్యాపార సంస్థ అమెజాన్ ఇక నుంచి చేనేత ఉత్పత్తులను విక్రయించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ చేనేత రంగ అభివృద్ధి కమిషనర్ తో ఒక ఒప్పందాన్ని చేసుకుంది. చేనేత సంఘాలు, కార్మికులు తామే స్వయంగా అమెజాన్ లో చేనేత వస్త్రాలను విక్రయించేందుకు వీలుగా అవకాశం కల్పించనున్నారు. రాజస్థాన్ లోని కోటా, పశ్చిమ బెంగాల్లోని నోయిడా, ఒడిషా లోని బార్గర్, అస్సాంలోని బిజోయినగర్ లలో చేనేత కార్మికులు తమ అమ్మకాలను నేరుగా అమెజాన్లో అమ్మేందుకు ఒప్పందం చేసుకుంది. ఇందుకోసం తమ కంపెనీ బృందాలు నాల్గు రాష్ట్రాల్లో వర్క్ షాప్ లను నిర్వహిస్తున్నట్టు, వస్త్రాలపై ఇండియా హాండ్లూమ్ బ్రాండ్, హాండ్లూమ్ మార్క్ ఉంటుందని అమెజాన్ తెలిపింది.
హాండ్లూమ్ కమిషనర్ అలోక్ కుమార్ స్పందిస్తూ.. చేనేత వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉందని తెలిపారు. అమెజాన్ తో ఒప్పందం వల్ల తమ ఉత్పత్తులు దేశంలోని నలుమూలలకు తేలికగా చేరుతాయన్నారు. భారతదేశంలోని ప్రతీ ఇంటికి చేనేత వస్త్రాలు అందించే లక్ష్యంతోనే ఈ ఒప్పందం చేసుకున్నామని అమెజాన్ జనరల్ మేనేజర్ గోపాల్ పిళ్లై తెలిపారు.