![Ambulance used to ferry alcohol - Sakshi](/styles/webp/s3/article_images/2017/12/26/12.jpg.webp?itok=z_VW2Hg9)
సాక్షి, మీరట్: అంబులెన్స్.. ఆపదలో ఉన్న వ్యక్తిని కాపాడే వరప్రదాయిని. రోడ్లపై అంబులెన్స్ శబ్దం వినిపిస్తే.. ప్రధానులు సైతం తప్పుకుని దారిస్తారు. ఇటువంటి అంబులెన్స్‌ను ఉత్తర్ ప్రదేశ్‌లోని ఒక ఆసుపత్రి పూర్వ విద్యార్థులు మద్యాన్ని తరలించడం కోసం వినియోగించడం ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది.
ఉత్తర్ ప్రదేశ్ మీరట్‌లోరి లాలా లజపతిరాయ్ మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో.. మద్యాన్ని తరలించడం కోసం అంబులెన్స్‌ను ఉపయోగించుకున్నారు. అంతేకాక సరదా కోసం రష్యా నుంచి బెల్లీ డ్యాన్సర్లను పిలిపించుకుని.. హడావుడి చేశారు.
లాలాలజపతి రాయ్ మెడికల్ కాలేజ్‌లో వైద్య విద్యను అభ్యసించిన 1992 బ్యాచ్ పూర్వ విద్యార్థులు.. సోమవారం నాడు సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ క్రమంలో పూర్వ విద్యార్థులు.. సెలబ్రేషన్స్‌ను అట్టహాసంగా నిర్వహించేందుకు మద్యం, మగువలను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా మద్యాన్ని తరలించేందుకు అంబులెన్స్ వాహనాన్ని వినియోగించారు. రష్యాను పిలిపించిన బెల్లీ డ్యాన్సర్లతో కలిసి వైద్యులు కూడా చిందులు వేశారు.
ఈ విషయంపై మెడికల్ కాలేజ్ ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్ వినయ్ అగర్వాల్ మాట్లాడుతూ.. ఈ ఘటన గురించి తనకు అప్పుడే తెలిసిందని చెప్పారు. . ఆ కార్యక్రమ నిర్వాహకుల నుంచి సమాధానం రావాల్సి ఉందని, మద్యం సరఫరాకు వినియోగించిన అంబులెన్సు మెడికల్ కాలేజీకి సంబంధించినదేనా లేదంటే ప్రైవేటు ఆస్పత్రికి చెందినదా అన్న విషయంపై క్లారిటీ లేదని, ఘటనపై సమగ్రంగా దర్యాప్తు చేస్తామని ఆయన తెలిపారు. ఈ ఘటనను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సైతం తీవ్రంగా ఖండించింది. ఈ పార్టీలో పాల్గొన్న వైద్యులపై ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోందని ప్రభుత్వం వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment