కిమ్‌ది యుద్ధ యాచన
► ఉ.కొరియాపై ఐరాసలో అమెరికా ఆగ్రహం
► కఠిన ఆంక్షలు విధించాలన్న అగ్రరాజ్యం
► చర్చలతోనే పరిష్కరించుకోవాలి: చైనా, రష్యా
ఐక్యరాజ్యసమితి: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ యుద్ధం కోసం యాచిస్తున్నారని ఐక్యరాజ్యసమితి (ఐరాస)లో అమెరికా శాశ్వత రాయబారి నిక్కీ హేలీ అన్నారు. అత్యంత శక్తిమంతమైన బాంబును ఉత్తర కొరియా ఆదివారం పరీక్షించగా, దీనిపై చర్చించేందుకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సోమ వారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. ఉత్తర కొరియాపై ఆంక్షల విషయంలో ఇతర దేశాలతో చైనా, రష్యాలు విభేదించడంతో ఏ నిర్ణయమూ తీసుకోకుండానే భేటీ ముగిసింది.
సమావేశంలో నిక్కీ హేలీ మాట్లాడుతూ,‘అంతర్జాతీయ సమాజం కన్నెర్రచేస్తున్నా అణు పరీక్షలు ఆపని ఉత్తర కొరియాను నిలు వరించేందుకు వీలైనంత కఠినమైన ఆంక్షలను విధించాలి. ఆ దేశాన్ని కట్టడి చేయాలంటే దౌత్యపరంగా ప్రస్తుతం ఉన్న మార్గం ఇదొక్కటే. యుద్ధానికి దిగాలని అమెరికా అనుకోవడం లేదు. కానీ మా సహనానికీ ఓ హద్దు ఉంటుంది. మా భూభాగాన్ని, మిత్రదేశాలను రక్షించుకోవడానికి తగిన చర్యలను తీసుకుంటాం’ అని హెచ్చరించారు.
ఫ్రాన్స్, బ్రిటన్, ఇటలీ రాయబారులు ఉత్తర కొరియాపై కొత్త ఆంక్షలు విధించాలన్నారు. చైనా, రష్యాలు మాత్రం ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాయి. ఐరాస ప్రధాన కార్య దర్శి ఆంటోనియో గ్యుటెరస్ మధ్యవర్తిత్వంలో అమెరికా, ఉత్తర కొరియాలు చర్చలు జరపాలని రష్యా రాయబారి సూచించారు. ఉత్తర కొరియా అణు పరీక్షలను నిలిపివేయాల్సిందేనని, చర్చలతోనే సమస్యను పరిష్కరించుకోవాలని చైనా ప్రతినిధి ల్యూ జీయ్ అన్నారు.
దక్షిణ కొరియాతో కలసి అమెరికా నిర్వహిస్తున్న సైనిక కార్యకలాపాలను ఆపేస్తే, ఉత్తర కొరియా అణుపరీక్షలను ఆపేస్తుందంటూ రష్యా తీసుకొచ్చిన ప్రతిపా దనను ప్రస్తావించారు. దీనిపై నిక్కీ మాట్లాడుతూ, సైనిక కార్యక లాపాలు ఆపేయడం తమకు అవమానమన్నారు. ‘ఓ వంచక దేశం అణ్వాయుధం అమర్చిన క్షిపణిని మీ దేశంవైపు తిప్పి ఉం చితే, మీరు మీ రక్షణ చర్యలను తగ్గించరు కదా. ఎవ్వరూ అలా చేయరు. మే కచ్చితంగా చేయం’ అని అన్నారు. ఉత్తర కొరియా తో వ్యాపారం చేసే ప్రతి దేశాన్ని తాము వంచక దేశానికి సాయ పడే వారిగానే చూస్తామని చైనాను ఉద్దేశించి అన్నారు.
హైడ్రోజన్ బాంబు కాకపోవచ్చు: ద.కొరియా
ఉత్తర కొరియా పరీక్షించినది హైడ్రోజన్ బాంబేనని కచ్చితంగా చెప్పలేమనీ, అయితే అత్యంత శక్తిమంతమైన అణుబాంబును తక్కువ పరిమాణంతోనే క్షిపణిలో నిక్షిప్తం చేయడంలో ఆ దేశం విజయం సాధించిందని దక్షిణ కొరియా అధికారులు పేర్కొన్నారు. ఆ బాంబు బరువు 50 వేల టన్నులు ఉంటుందన్నారు. ఉత్తర కొరియా మరో క్షిపణిని పరీక్షించేందుకూ సిద్ధమవుతూ ఉండొచ్చని దక్షిణ కొరియా భావిస్తోంది. దీంతో తన రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకుం టోంది. ఉత్తర కొరియా బాంబు వల్ల వాతావరణంలో రేడియేషన్ ఏమీ రాలేదని చైనా, జపాన్ ప్రకటించాయి.