
కోల్‌కతా: దేశ భద్రత కోసం జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్నార్సీ) తప్పనిసరి అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. హిందూ, సిక్కు, జైన్, బౌద్ధ మతాలకు చెందిన శరణార్థులకు మాత్రం పౌరసత్వ సవరణ బిల్లు ద్వారా భారత పౌరసత్వం కలి్పస్తామన్నారు. కోల్‌కతాలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో అమిత్ మాట్లాడారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎన్నార్సీ గురించి తప్పుడు సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళుతున్నారని తెలిపారు. ఎన్నార్సీ పేరుతో బెంగాలీలను తరిమేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ, తమపై ఆమె తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని పేర్కొన్నారు. బెంగాల్‌లో ఎన్నార్సీ అమలవుతుందని, భయపడాల్సినంత ఏమీ జరగదని తెలిపారు. చొరబాటుదారులను దేశం నుంచి వెళ్లగొడతామని స్పష్టం చేశారు. చొరబాటుదారులతో ప్రపంచంలో ఏ దేశం సుభిక్షంగా ఉండలేదని, అందుకే చొరబాట్లను నిరోధించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మమతా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చొరబాటుదారులను బెంగాల్ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారని, ఇప్పుడు వారే ఆమెకు ఓటుబ్యాంకుగా మారారని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా స్పందిస్తూ.. ‘దయచేసి ప్రజల్లో భేదాభిప్రాయాలు సృష్టించకండి. బెంగాలీలు మతాలకతీతంగా తమ నాయకులను గౌరవిస్తున్నారు. దాన్నెవరూ చెరపలేరు’ అని అమిత్‌షా వ్యాఖ్యలకు పరోక్షంగా బదులిచ్చారు.