'మూడో ఓటమి చూస్తారా.. రాజీనామా చేస్తారా'
ధార్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తన పదవికి రాజీనామా చేయాలని ప్రముఖ హిందీ కవి, బీజేపీ మాజీ ఎంపీ ఓంపాల్ సింగ్ నిడార్ వ్యాఖ్యానించారు. ఇటీవలే జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయాన్ని చవిచూసినందుకు బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి నుంచి అమిత్ షాను తప్పుకోవాలన్నారు. అత్యధిక లోక్సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్కు చెందిన నేతకు ఆ పదవి అప్పగించాలని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లోని ధార్లో జరిగిన కవి సమ్మేళనంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మరిన్ని విషయాలను ప్రస్తావించారు.
పార్టీ పగ్గాలు రాష్ట్ర నేతకు అప్పగిస్తే 2017లో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి కలిసొస్తుందన్నారు. దేశ రాజకీయాలపై యూపీ ప్రభావం అధికంగా ఉంటుందని చెప్పారు. తొలుత ఢిల్లీ, ఇప్పుడు బిహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తర్వాత కూడా షా సీటునే అంటిపెట్టుకుని ఉన్నారని వ్యాఖ్యానించారు. మూడో ఓటమి కోసం ఎదురుచూస్తారా.. లేక సీటు నుంచి తప్పుకుంటారా అని నిడార్ ప్రశ్నించారు. అంతగా అవసరం అనుకుంటే ప్రధాని నరేంద్ర మోదీ తన సలహాదారుడిగా అమిత్ షాను నియమించుకోవాలని సూచించారు. హిందుత్వ అజెండా, అభ్యర్థులు ఓటర్లకు దగ్గర కాకపోవడం, ఎన్నికల ప్రచారం ప్రభావవంతంగా లేకపోవడం లాంటి కారణాల వల్ల బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ పరాజయాన్ని చవిచూసిందని ఆయన అభిప్రాయపడ్డారు.