
సరిహద్దుపై ఆమోదయోగ్య ఒప్పందం
గాంగ్జౌ: నాలుగు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మంగళవారం చైనా చేరుకున్నారు. చైనాలోని ప్రముఖ వాణిజ్య నగరమైన గాంగ్జౌలో ప్రణబ్‌కు ఆ విదేశాంగ ఉప మంత్రి లియూ జెన్‌మిన్ అధికారికంగా స్వాగతం పలికారు. అణు సరఫరా దేశాల కూటమి(ఎన్‌ఎస్జీ)లో భారత్ చేరికను చైనా వ్యతిరేకించడం, జైషే మహమ్మద్ అధినేత మసూద్‌పై ఐరాసలో నిషేధ తీర్మానాన్ని అడ్డుకోవడం వంటి అంశాల్ని ఈ పర్యటన లోరాష్ట్రపతి లేవనెత్తనున్నారు. బుధవారం భారత్-చైనా బిజినెస్ ఫోరంలో రాష్ట్రపతి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ భారత వ్యాపారవేత్తలు కూడా హాజరుకానున్నారు.
గురువారం బీజింగ్ చేరుకుని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తోపాటు ఇతర నాయకులతో రాష్ట్రపతి చర్చిస్తారు. చైనా ప్రధాని లీ కెకియాంగ్, ఆ దేశ పీపుల్స్ కాంగ్రెస్ చైర్మన్ ఝాంగ్ డేజియాంగ్‌లతో కూడా భేటీ అవుతారు. పర్యటన సందర్భంగా చైనా జాతీయ చానల్‌తో ప్రణబ్ మాట్లాడుతూ సరిహద్దు వివాదంలో నిజాయతీతో కూడిన పరస్పర ఆమోదయోగ్య ఒప్పందాన్ని భారత్ కోరుకుంటోందని చెప్పారు. గ్వాంగ్‌రలో భారత రాయభారి విజయ్ గోఖలే ఏర్పాటు చేసిన విందులో ప్రణబ్ ప్రసంగిస్తూ... ఎన్‌ఎస్జీలో భారత్ సభ్యత్వంపై చైనా దేశాధినేతలతో మాట్లాడతానని చెప్పారు. విభేదాలు పెంచుకునేందుకు భారత్ ఎప్పుడూ ప్రయత్నించలేద ని, తగ్గించేందుకే కృషిచేసిందన్నారు. గతంలో ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు, రక్షణ మంత్రి హోదాలో చైనాలో పర్యటించిన ప్రణబ్... రాష్ట్రపతి హోదాలో చైనాకు వెళ్లడం ఇదే తొలిసారి.
నేపాల్ మీదుగా భారత్‌కు రైలు మార్గం!
భారత్‌కు నేపాల్ మీదుగా రైలు మార్గం నిర్మించి సంబంధాల్ని మరింత మెరుగుపర్చుకోవాలని చైనా భావిస్తోందని ఆ దేశ జాతీయ మీడియా వెల్లడించింది. టిబెట్ నుంచి నేపాల్‌కు రైల్వే లైను నిర్మించే పనిలో ఉన్న చైనా ఆ మార్గాన్ని భారత్‌లోని బిహార్ వరకూ విస్తరించాలనే ఆలోచనలో ఉందని గ్లోబల్ టైమ్స్ పత్రిక మంగళవారం పేర్కొంది. ఈ రైలు మార్గం నిర్మాణం వల్ల భారత్‌తోపాటు, దక్షిణాసియా దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయని చైనా భావిస్తోంది. టిబెట్ నుంచి నేపాల్‌లోని రసువగధికి రైలు మార్గంపై ఇప్పటికే ఇరు దేశాలు చర్చించాయి. 2020లోపు ఈ మార్గాన్ని పూర్తి చేసే లక్ష్యంతో ముందడుగు వేస్తోన్న చైనా అక్కడి నుంచి బిహార్‌లోని బిర్‌గంజ్‌కు 240 కిలోమీటర్ల ైరె ల్వే లైను నిర్మించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం .