పాట్నా: తనకు తగిలిన గాయం కన్నా తన ముందున్న విధి నిర్వహణే పెద్దగా కనిపించిందామెకు. వెంటనే గాయానికి కట్టు కట్టుకుని కర్ర సాయంతో పనిలోకి దిగింది ఓ అంగన్ వాడీ కార్యకర్త. బీహార్‌లోని పాట్నాకు చెందిన విమల కుమారి అంగన్‌వాడీ కార్యకర్తగా పని చేస్తుంది. పదిహేనేళ్ల క్రితమే ఆమె భర్త చనిపోయాడు. లలిత భవన్‌కు దగ్గరలోని మురికివాడలో ఆమె ఒంటరిగా జీవనం కొనసాగిస్తోంది. మార్చి నెలలో ఓరోజు ఆమె పట్టు తప్పి కింద పడిపోవడంతో కాలికి గాయం అయింది. వేరే వ్యక్తులైతే దెబ్బ తగిలిందన్న సాకుతో పనికి ఎగనామం పెట్టేందుకే ఆసక్తి చూపేవాళ్లు. కానీ ఆమె అలా చేయలేదు. తన కర్తవ్యం ఎల్లవేళలా విధి నిర్వహణలో భాగం కావడమే అనుకుంది. ప్రభుత్వం కరోనా సంబంధిత లక్షణాలు ఉన్నవారిని గుర్తించేందుకు ఆదేశించిన ఇంటింటి సర్వేలో భాగమైంది. అడుగు తీసి అడుగు వేసే క్రమంలో సలుపుతున్న గాయం నొప్పి పంటికింద భరిస్తూ ముందుకు సాగింది. ఉదయం సూర్యుడితోపాటు బయలు దేరుతూ సూర్యాస్తమయం వరకు పనిలో లీనమైపోయింది. (17 రోజుల పసికందుతో బాలింత కాలినడక)
సెలవు ఇచ్చినా వద్దనుకుంది
అలా ఓ కర్ర సాయంతో ఇప్పటివరకు 380 ఇళ్ల చుట్టూ తిరిగింది. ఇది గమనించిన ఓ వ్యక్తి ఆమె ఫొటో తీసి ట్విటర్‌లో షేర్ చేశాడు. ఆమె అంకిత భావానికి, నిబద్ధతకు ఈ ఫొటో నిలువెత్తు నిదర్శమని పేర్కొన్నాడు. ఈ విషయం గురించి విమల మాట్లాడుతూ.. "నేను సెలవు తీసుకుని ఇంట్లో ఉంటే నా చుట్టూ ఉన్న మనుషులు అనారోగ్యంతో బాధపడే అవకాశం ఉంది. అసలే కరోనా విజృంభిస్తోంది. ఇలాంటి విపత్కర సమయంలో నేనా పని చేయదలుచుకోలేదు. ఇప్పుడు నా అవసరం మరెంతో ఉందనిపించింది. పైగా నేను ఉంటున్న మురికివాడలోని జనాలకు నాపై విశ్వాసం ఎక్కువ. పోలియో చుక్క మొదలు, ఎలాంటి వ్యాక్సిన్‌లైనా వేసేందుకు నన్ను తప్ప మరో కార్యకర్తను అనుమతించరు" అని చెప్పుకొచ్చింది. విమలకు సెలవు ఇచ్చినప్పటికీ, దాన్ని వినియోగించుకోలేదని ఓ అధికారి తెలిపారు. కాగా బీహార్‌లో 541 కరోనా కేసులు నమోదవగా నలుగురు మరణించారు. (కరోనా కర్కశత్వం)
Comments
Please login to add a commentAdd a comment