మరో తృణమూల్ ఎంపీ అరెస్ట్
రోజ్ వ్యాలీ చిట్ స్కాంలో సీబీఐ అదుపులో సుదీప్
♦ పీఎంఓ ఒత్తిడితోనే: పశ్చిమబెంగాల్ సీఎం మమత
కోల్‌కతా: చిట్ ఫండ్ స్కాంలో వారం తిరగక ముందే మరో తృణమూల్ కాంగ్రెస్ నేత అరెస్టయ్యారు. రోజ్ వ్యాలీ చిట్ ఫండ్ స్కాం కేసులో తృణమూల్ ఎంపీ, లోక్‌సభలో ఆ పార్టీ పార్లమెంటరీ నేత అయిన సుదీప్ బంధోపాధ్యాయ్‌ని సీబీఐ మంగళవారం అరెస్ట్ చేసింది. ఇక్కడి సీబీఐ ఆఫీసుకు వచ్చిన ఆయనను 4గంటలపాటు సదీర్ఘంగా విచారించి అనంతరం అదుపులోకి తీసుకుంది. ఆయన దర్యాప్తునకు సహకరించలేదని, రోజ్ వ్యాలీ కంపెనీ స్పాన్సర్ చేసిన విదేశీ పర్యటనపై ప్రశ్నలకు జవాబులివ్వలేదని సీబీఐ వర్గాలు చెప్పాయి. తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీ, ఎంపీలు సీబీఐ కార్యాలయానికి వెళ్లి ఆయనను కలుసుకుని మద్దతు తెలిపారు. ఈ కేసులో ఆయనకు ఇదివరకు మూడుసార్లు దర్యాప్తు సంస్థ సమన్లు జారీ చేసింది. ఇదే స్కాంలో మరో తృణమూల్ ఎంపీ తపస్ పాల్‌ను శుక్రవారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సుదీప్ అరెస్ట్‌తో రెచ్చిపోయిన తృణమూల్ అనుబంధ విద్యార్థి సంఘం కార్యకర్తలు నగరంలోని బీజేపీ ప్రధాన కార్యాలయంపై రాళ్లు రువ్వి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ కార్యకర్తలు 15 మంది గాయపడ్డారని బీజేపీ తెలిపింది.
మోదీ దమ్ముంటే అరెస్ట్ చేయండి
సుదీప్ అరెస్ట్‌పై తృణమూల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) ఒత్తిడితోనే అరెస్ట్ చేశారని, మోదీని, అమిత్ షాను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. దమ్ముంటే తనను, తమ పార్టీ ఎంపీలందర్నీ అరెస్ట్ చేయాలని ప్రధానికి సవాల్ విసిరారు. నోట్ల రద్దును వ్యతిరేకిస్తున్న వారిపై మోదీ సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఆదాయ పన్ను శాఖలను ఉసిగొల్పుతూ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ‘ఆయన ఇతరులను నోరుమూయించగలరు కానీ నన్ను కాదు. ప్రజల గొంతుకను నొక్కలేరు. ఆయన చేతిలో ప్రభుత్వం ఉంది. నా చేతిలోనూ ప్రభుత్వం ఉంది. అల్లర్లకు పాల్పడ్డవారిని నేను అరెస్ట్ చేయించగలను. కానీ ప్రజాస్వామ్యంపై నాకు నమ్మకముంది కాబట్టి ఆ పని చేయలేదు’ అని అన్నారు. కాగా, అనధికార లెక్కల ప్రకారం రూ. 60వేల కోట్ల విలువైన రోజ్ వ్యాలీ చిట్ స్కాం దేశంలోనే అతి పెద్ద చిట్ ఫండ్ స్కాం అని భావిస్తున్నారు.