
బెంగళూరుకు ఆపిల్ కళ.. అక్కడ నుంచే ఐఫోన్స్!
బెంగళూరు: ప్రతిష్టాత్మక సంస్థ ఆపిల్ తన ఐఫోన్‌లను ఇక భారత్‌లో కూడా తయారు చేయనుంది. ఇందుకోసం బెంగళూరు నగరాన్ని ఎంచుకోవాలని నిర్ణయించిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏప్రిల్ నుంచి ఈ నగరంలోనే భారత్‌కు అవసరమైన ఐఫోన్లను తయారుచేసి మార్కెట్లోకి విడుదల చేయనుంది. విస్ట్రన్ తైవానీస్ ఓఈఎం అనే సంస్థ ఆపిల్ సంస్థకు చెందిన ఐఫోన్లను తయారుచేస్తోంది. ఇప్పుడు ఈ ఓఈఎం బెంగళూరులోని ఇండస్ట్రియల్ హబ్ అయిన పీన్యాలో ఐఫోన్ తయారీలను ప్రారంభించాలని నిర్ణయించినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
ఆపిల్ సంస్థ ఉన్నత వర్గాల సమాచారం మేరకు భారత్‌లో వచ్చే ఏడాది చివరినాటికి ఐఫోన్ తయారీ పూర్తి స్థాయి ప్రక్రియను సిద్ధం చేయాలని చాలా సీరియస్‌గా ఆపిల్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో బెంగళూరు నగరాన్నే అందరూ ఆమోదించినట్లు సమాచారం. భారత్‌లోనే వీటిని నేరుగా తయారు చేయడం వల్ల ధరలో కూడా కొంతమార్పు వచ్చి అమ్మకాలు కూడా విపరీతంగా జరిగి కంపెనీకి లాభాలు వస్తాయని ఆపిల్ భావిస్తోంది. అయితే, మహారాష్ట్రలో కూడా ఫాక్స్‌కాన్ అనే సంస్థ ఆపిల్ ఫోన్లను తయారుచేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ అది షియామి, వన్‌ప్లస్ వంటి లోకల్ బ్రాండ్లకు ఫోన్లను తయారుచేసి ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుందని, ఒక్క ఆపిల్ మాత్రమే కాదని, కానీ బెంగళూరులో పెట్టే తయారీ సంస్థ మాత్రం పూర్తి స్థాయిలో ఆపిల్ ఐఫోన్ల మీదే దృష్టి సారించనుందట.