సుప్రీం కోర్టు న్యాయవాదితో నీటిపారుదలశాఖ అధికారుల చర్చలు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల కేటాయింపు వివాదంపై రాష్ట్ర నీటిపారుదలశాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ నెల 29న సుప్రీంకోర్టులో కృష్ణా జలాలపై తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, మహరాష్ట్ర, కర్ణాటకల వాదనలను కోర్టు విననున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్‌తో అధికారులు మంగళవారం చర్చలు జరిపారు. గతంలో బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్.. తెలంగాణ మినహా మిగిలిన మూడు రాష్ట్రాలకు జరిపిన కేటాయింపులపై సమీక్ష జరపాల్సి ఉందని చెప్పిన అంశాన్ని సుప్రీంకోర్టు దృష్టికి బలంగా తీసుకెళ్లాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. కృష్ణా జలాలను నాలుగు రాష్ట్రాలు వాడుకుంటున్నప్పుడు కేటాయింపులు సైతం ఆయా రాష్ట్రాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని జరగాల్సి ఉంటుందని అధికారులు సుప్రీం న్యాయవాది దృష్టికి తీసుకెళ్లారు.
బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా దెబ్బతీసేదిలా ఉందని, నదీ పరీవాహకం మేరకు కేటాయింపులు జరపలేదనే వివరాలను గణాంకాలతో సహా వైద్యనాథన్‌కు అధికారులు అందించారు. ఈ చర్చల సందర్భంగా న్యాయవాది వైద్యనాథన్‌కు తోడుగా మరో సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వేను కూడా నియమించేందుకు అధికారులు సంసిద్ధత వ్యక్త్తం చేసినట్లు తెలిసింది.