ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్
న్యూఢిల్లీ : కశ్మీరు యువత ఉగ్రవాదం వైపు ఆకర్షితులవ్వడం ఆందోళనకరమని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ అన్నారు. ఈ సందర్భంగా రావత్.. ‘ఆయుధాలతో స్వతంత్రం సిద్దించదు. ఉగ్రవాదులు సైన్యంతో పోరాడలేరు’ అనే బలమైన సందేశాన్ని ఇచ్చారు. భద్రతా దళాలు గత ఆదివారం జరిపిన కాల్పుల్లో కశ్మీరుకు చెందిన అధ్యాపకుడు మహ్మద్ రఫి భట్ మరణించిన సంగతి తెలిసిందే. రఫి మరణం తర్వాత బిపిన్ రావత్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
‘కశ్మీర్ యువతకు నేను చెప్పదల్చుకున్నది ఒక్కటే. మీరు అనుకునే ఆజాది(స్వతంత్రం) ఎప్పటికి సిద్దించదు. మీరంతా ఆయుధాలు చేతపట్టినంత మాత్రాన జరిగేదేమీ ఉండదు. ఆజాదీ పేరుతో అరాచకం సృష్టించాలనుకుంటే మేము(సైన్యం) చూస్తూ ఉండం.. మీరు కోరుకునే స్వతంత్రం ఎప్పటికి రాదు’ అని బిపిన్ రావత్ తెలిపారు. కొన్ని దేశవిద్రోహక శక్తులు యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయని, ఫలితంగా వారు హింసా మార్గాన్ని ఎన్నుకుని ఆయుధాలను చేపడుతున్నారని విచారం వ్యక్తం చేశారు.
రెండేళ్ల క్రితం 11 మంది యువకులు తుపాకులు చేతబట్టి దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడం... భద్రతాబలగాలు ఆ ఫొటోలో ఉన్న 10 మందిని వేర్వేరు ఎన్‌కౌంటర్లలో మట్టుపెట్టిన సంగతి తెలిసిందే. ఆదివారం జమ్ముకశ్మీర్‌లోని షోఫియాన్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో బుర్హాన్ వనీ గ్యాంగ్ చివరి సభ్యుడు సద్దాం పద్దేర్ కూడా హతమయ్యాడు. దీని గురించి రావత్ ‘వారు(ఉగ్రవాదులు) కొత్తవారిని చేర్చుకుంటున్నారు.కానీ దీని వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు’ అన్నారు. అంతేకాక ఉగ్రవాదుల దాడల్లో మరణిస్తున్న సైనికుల గురించి మాట్లాడుతూ ఎన్‌కౌంటర్‌లో ఎంత మంది సైనికులు మరణించారనే అంశాన్ని నేను పెద్దగా పట్టించుకోను. ఎందుంటే ఇది ఒక నిరంతర ప్రక్రియ.. ఇది కొనసాగుతూనే ఉంటుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment