
వాళ్లిద్దరి మధ్య సంబంధం ఏమిటి?
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి మీడియాపై దాడి చేశారు. కేంద్రమంత్రి అరుణ్ జైట్లీకి, ఓ ఆంగ్ల పత్రిక ఎడిటర్ అర్ణబ్ గోస్వామికి మధ్య ఉన్న సంబంధమేంటో చెప్పాలని డిమాండ్ చేయడం సంచలనం రేపింది. శుక్రవారం సోషల్ మీడియాలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆప్ నేత వినీతా దేశ్‌ముఖ్ ట్వీట్‌కు స్పందించిన కేజ్రీవాల్.. అర్ణబ్ గోస్వామిపై విరుచుకుపడ్డారు. కేంద్రమంత్రిని వెనకేసుకు రావడంలో అర్ణబ్ ఉద్దేశం ఏమిటో.. వాళ్లిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏమిటో చెప్పాలని ట్వీట్ చేశారు.
రాజ్దీప్ సర్దేశాయ్‌లా నిష్పాక్షికంగా వ్యవహరించకుండా ఎందుకు అరుపులు, పెడబొబ్బలు పెడతున్నారంటూ అర్ణబ్‌ను ఉద్దేశించి వినీత ట్వీట్ చేశారు. అర్ణబ్ గోస్వామి.. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీని ఎందుకు వెనకేసుకు వస్తున్నారని ప్రశ్నించారు. దీనికి స్పందించిన కేజ్రీవాల్.. జైట్లీతో ఆయనకున్న రిలేషన్ ఎలాంటిదో వెల్లడించాలని ప్రశ్నించారు.
కాగా ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ)లో భారీ ఆర్థిక అవకతవకలకు సంబంధించిన ఫైలు కోసమే ఢిల్లీ సచివాలయంలో సీబీఐ దాడులు చేసిందని కేజ్రీవాల్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. సీబీఐ దాడుల పేరుతో ద్వారా తనను, తన ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఎన్డీయే ప్రయత్నిస్తోందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మీద పరుష పదజాలంతో విమర్శలు చేసిన సీఎం వ్యక్తిత్వం ఎలాంటిదో దేశ ప్రజలంతా చూశారని జైట్లీ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే డీడీసీఏ మాజీ అధ్యక్షుడు జైట్లీ, ఢిల్లీ సీఎం మధ్య వివాదం రాజుకుంది.
Arnab ought to answer this. What is Arnab's relationship wid Jaitley ji? https://t.co/VdmSx6P60p
— Arvind Kejriwal (@ArvindKejriwal) December 18, 2015