ఏటీఎం బంపర్ బొనాంజా?
Published Thu, Dec 17 2015 10:50 AM | Last Updated on Sun, Sep 3 2017 2:09 PM
జైపూర్: సికార్ జిల్లాలోని అజిత్ ఘడ్ ప్రాంతంలోని యాక్సీస్ బ్యాక్ ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేందుకు వెళ్లిన ఖాతాదారులకు సోమవారం బంపర్ బొనాంజా తగిలింది. ఎందుకంటే...ఆ ఏటీఎం భారీ ఆఫర్ ఇచ్చింది. అడిగిన దానికంటే అయిదు రెట్టు డబ్బులు ఖాతాదారుల పాలిట కామధేనువు లాంటి మారిపోయింది. వంద రూపాయలకు బదులుగా 500 రూపాయలు, ఐదు వందల రూపాయలు డ్రా చేస్తే వెయ్యి రూపాయలు నోట్లు వచ్చాయి. ఇక వినియోగదారులు ఈ అవకాశాన్ని వదులుకుంటారా... ఆ నోటా.. ఈనోటా ఈ వార్త దావాలనంలా వ్యాపించింది. డబ్బు డ్రా చేసుకునేందుకు ఖాతాదారులు క్యూ కట్టారు. నేను ముందు అంటే.. నేను ముందు అంటూ ఎగబడ్డారు. తోపులాట జరిగింది.
దీంతో విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు హుటా హుటిన రంగంలోకి దిగారు. ఎటీఎంకు తాళం వేసి రక్షణ ఏర్పాటు చేశారు. మంగళవారం మధ్యాహ్నానికి నిపుణుల బృందం స్పాట్కు చేరుకుంది. సాంకేతిక లోపం కారణంగానే ఈ సమస్య ఉత్పన్నమైందని వివరించారు. విచారణకు ఆదేశించారు. ఎంతమందికి అదనంగా డబ్బులు అందాయో ఆరా తీసి, ఆ సొమ్మును రాబడతామన్నారు.
Advertisement