బెంగళూరు: తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేను ప్రలోభపెట్టేందుకు ప్రతిపక్ష బీజేపీ ప్రయత్నిస్తోందనీ, అందుకు సాక్ష్యమిదేనంటూ శుక్రవారం కర్ణాటక సీఎం కుమారస్వామి ఓ ఆడియో క్లిప్పింగ్‌ను మీడియాకు వినిపించారు. ఆ ఆడియోలో...అధికార జేడీ(ఎస్)కు చెందిన ఎమ్మెల్యే నాగన్ గౌడ కొడుకు శరణ్‌తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప ఫోన్‌లో మంతనాలు జరుపుతున్నట్లుగా ఉంది. బీజేపీ పక్షంలోకి వస్తే మంత్రి పదవితోపాటు మరిన్ని లాభాలు కల్పిస్తామని, స్పీకర్ సైతం వస్తే రూ.50 కోట్లు ఇస్తామన్నట్లుగా ఆడియోలో ఉంది. ఆ ఆడియోను లేబొరేటరీకి పంపి అందులోని వాయిస్ ఎవరిదో తేలుస్తామన్నారు. జేడీఎస్ ఎమ్మెల్యేను ప్రలోభపెట్టే క్రమంలో తన పేరు ప్రస్తావనకు రావడంపై స్పీకర్ రమేశ్ కుమార్ స్పందించారు. ఆ ఆడియో క్లిప్‌పై విచారణ చేయించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.
అందులో ఎవరు ఎవరితో మాట్లాడుతున్నదీ స్పష్టంగా లేనప్పటికీ ఇది చాలా తీవ్రమైన అంశమన్నారు. ఆ క్లిప్పులో జడ్జీల పేర్లు, ప్రధాని మోదీతోపాటు బీజేపీ చీఫ్ అమిత్‌ల పేర్లు ప్రస్తావనకు వచ్చాయని వివరించారు. సీఎం కుమారస్వామి చేసిన ఆరోపణలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప కొట్టిపారేశారు. కాగా, సీఎల్పీ సమావేశానికి గైర్హాజరైన తమ నలుగురు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. బుధవారం నుంచి మొదలైన బడ్జెట్ సమావేశాలకు హాజరుకాని రమేశ్ జర్కిహోలి, ఉమేశ్ జాధవ్, మహేశ్ కుమతాలి, బి.నాగేంద్రలపై ఫిరాయింపుల చట్టం కింద చర్య తీసుకోనున్నట్లు సీఎల్పీ నేత సిద్ధరామయ్య వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment