
సాక్షి, న్యూఢిల్లీ : జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ పాకిస్తాన్ జైలులో మగ్గుతున్నాడనే వార్తలను భారత అధికారులు తోసిపుచ్చారు. పాకిస్తాన్‌లోని ఏ జైలులోనూ మసూద్ అజర్ ఎన్నడూ లేడని అధికార వర్గాలు పేర్కొన్నాయి. మసూద్ ప్రస్తుతం అజ్ఞాతంలో గడుపుతున్నాడని, ఆయన చివరిసారి బహవల్‌పూర్‌లోని జైషే మహ్మద్ హెడ్‌క్వార్టర్స్ మర్కజ్ సుభానల్లాకు వచ్చాడని ఆ వర్గాలు తెలిపాయి. మసూద్ ఆరోగ్యం సైతం మెరుగుపడిందని, అయితే ఆయన జనబాహుళ్యంలోకి రావడం లేదని పేర్కొన్నాయి. ఈ ఏడాది మేలో మసూద్ అజర్‌ను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించిన సంగతి తెలిసిందే. కాగా భారత్‌ను రెచ్చగొట్టే చర్యల్లో భాగంగా పాకిస్తాన్ వాస్తవాధీన రేఖ వెంబడి సాయుధ దళాలను మోహరించిన క్రమంలో మసూద్ కదలికలపై సమాచారం బహిర్గతం కావడం గమనార్హం. మరోవైపు జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ను మోదీ ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో భారత్‌లో భారీ ఉగ్రదాడికి ఐఎస్‌ఐ సహకారంతో ఉగ్ర మూకలు స్కెచ్ వేస్తున్నాయని నిఘా వర్గాలు హెచ్చరించాయి.
Comments
Please login to add a commentAdd a comment