
నేను బలి పశువును కాదు: అజహర్
న్యూఢిల్లీ: రాజస్థాన్‌లోని టోంక్-సవాయి మాధోపూర్ లోక్‌సభ స్థానంలో అభ్యర్థిగా బరిలోకి దింపినందున తానేమీ బలి పశువును కాలేదని మాజీ క్రికెటర్, కాంగ్రెస్ ఎంపీ మహ్మద్ అజహరుద్దీన్ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ నియోజకవర్గం సిట్టింగ్ ఎంపీ అయిన అజహర్ అక్కడి నుంచి పోటీకి విముఖంగా ఉండటంతో ఆయనను రాజస్థాన్ నుంచి పోటీకి దింపి బలి పశువును చేశారంటూ ఊహాగానాలు సాగుతున్న నేపథ్యంలో ఆయన ఈ మేరకు ‘ఐఏఎన్‌ఎస్’ వార్తా సంస్థ ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. మొరాదాబాద్ నుంచి వేరే స్థానానికి ఎందుకు మారారన్న ప్రశ్నకు అజహర్ కొంత అసంతృప్తికి గురయ్యారు. తాను వేరే సీటు కావాలని కోరలేదని, అది పార్టీ నిర్ణయమని తెలిపారు. అయినా తాను బలి పశువును కాలేదన్నారు.
ఇంటర్వ్యూలో అజహర్ ఇంకా ఏమన్నారంటే...
మొరాదాబాద్‌ను విడిచిపెట్టేందుకు నాకు ఏ కారణ మూ లేదు. ఐదేళ్లుగా నేనక్కడ కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులు చేశాను.
ఒక క్రికెటర్‌గా ఎలాంటి పిచ్‌పై అయినా ఆడేందుకు సిద్ధంగా ఉండాలి. అన్నిసార్లూ బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌లే కావాలని నేను అడగలేను.
పార్టీ అధినాయకత్వం నిర్ణయాన్ని గౌరవిస్తూ.. పార్టీకి గెలుపు దక్కేలా శాయశక్తులా కృషి చే స్తాను. కాగా, టోంక్-సవాయి నుంచి ఢిల్లీకి వచ్చిన స్థానిక కాంగ్రెస్ నేతలు అజహర్‌కు మద్దతు ప్రకటించారు.