కేబినెట్‌లోకి దత్తాత్రేయ | bandaru dattatreya in cabinet | Sakshi
Sakshi News home page

కేబినెట్‌లోకి దత్తాత్రేయ

Published Sat, Nov 8 2014 1:21 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

కేబినెట్‌లోకి దత్తాత్రేయ - Sakshi

కేబినెట్‌లోకి దత్తాత్రేయ

రేపు రాష్ర్టపతిభవన్‌లో మధ్యాహ్నం ఒంటి గంటకు కార్యక్రమం
ఢిల్లీ రావాలని దత్తన్నకు పిలుపు  శివసేనకు రెండు బెర్తులు
టీడీపీ నుంచి సుజనా, రామ్మోహన్ నాయుడుల్లో ఒకరికి చాన్స్
కొత్తగా పది మందికి అవకాశమివ్వనున్న ప్రధాని మోదీ
 
సాక్షి, న్యూఢిల్లీ, హైదరాబాద్: కేంద్ర మంత్రి వర్గంలో తెలంగాణకు బెర్త్ దాదాపు ఖాయమైంది. సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయకు శుక్రవారం రాత్రి ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) నుంచి పిలుపు వచ్చినట్లు తెలిసింది. కేబినెట్ విస్తరణలో సీటు ఖరారైందని, విస్తరణ సందర్భంగా ఆదివారం పీఎంఓలో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చే తేనీటి విందుకు రావాల్సిందిగా ఆ కార్యాలయ వర్గాలు దత్తన్నను ఆహ్వానించాయని సమాచారం. విస్తరణ సమాచారం బయటకు వచ్చినప్పటి నుంచి ఉత్కంఠగా గడిపిన కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ గురువారం ఢిల్లీకి వెళ్లినట్లు తెలిసింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వెనుదిరిగి వస్తుండగా ఆయనకు పిలుపు వచ్చినట్లు సమాచారం. దీంతో హైదరాబాద్ చేరుకున్న ఆయన పీఎంఓ ఆహ్వానంపై శనివారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీ వెళుతున్నట్టు తెలిసింది. తెలంగాణ ప్రాంతంలో పార్టీని బలోపేతం చేయాలంటే తప్పనిసరిగా కేంద్ర కేబినెట్‌లో స్థానం కావాలని ఇక్కడి బీజేపీ నేతలు పట్టుబట్టడం, ఈ ప్రాంతంలో ఆపార్టీకి ఉన్న ఏకైక ఎంపీ దత్తాత్రేయ ఒక్కరే కావడం ఆయన కు కలిసొచ్చిందని సన్నిహితులు చెబుతున్నారు. దత్తాత్రేయ 1998-2002 మధ్య కేంద్రంలో పట్టణాభివృద్ధి సహాయ మంత్రిగా, 2002-2004 మధ్య రైల్వే శాఖసహాయ మంత్రిగా పనిచేశారు.
 
 శివసేనకు రెండు బెర్తులు: కేంద్ర కేబినెట్ తొలి విస్తరణ, పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధమైంది. బీజేపీ నుంచి పలువురు కొత్త ముఖాలతో పాటు మిత్రపక్షాలైన శివసేన, టీడీపీకి కూడా కేబినెట్‌లో చోటు దక్కనుంది. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు రాష్ర్టపతి భవన్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. గోవా సీఎం మనోహర్ పారికర్‌కు రక్షణ శాఖ బాధ్యతలతో పాటు కొత్తగా పది మందికి అవకాశం దక్కనున్నట్లు సమాచారం. బీజేపీ తరఫున పంజాబ్ నుంచి తొలిసారి నెగ్గిన విజయ్ సాంప్లా, సీనియర్ నేత యశ్వంత్ సిన్హా తనయుడు జయంత్ సిన్హా, హర్యానా నుంచి జాట్ నేత బీరేందర్‌సింగ్, బీహార్ నుంచి గిరిరాజ్‌సింగ్ లేదా భోలా సింగ్, రాజ్‌స్థాన్ నుంచి కల్నల్ సోనారామ్ చౌదరీ, గజేంద్ర సింగ్ షెకావత్, మహారాష్ర్ట నుంచి హన్స్‌రాజ్ అహిర్‌తో పాటు సీనియర్ నేత ముక్తార్ అబ్బాస్ నక్వీకి అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది.

 

బీజేపీ ప్రధాన కార్యదర్శి జేపీ నడ్డాకు కూడా బెర్తు దక్కొచ్చని తెలుస్తోంది. తొలి వంద రోజుల పనితీరు ఆధారంగా కొంతమంది మంత్రుల శాఖలను మార్చి, కొంతమందిని కేబినెట్‌నుంచి తప్పించే అవకాశముంది. కొత్తగా కేబినెట్‌లో చేరనున్న వారికి.. మోదీ ఇచ్చే టీవిందుకు రావాలని పీఎంఓ ఫోన్లు చేసింది. వీరిలో గిరిరాజ్‌రాజ్, అహిర్, సాంప్లా తదితరులు ఉన్నట్లు సమాచారం. కాగా, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ తాను అదనంగా నిర్వహిస్తున్న రక్షణ శాఖను వదులుకోనున్నానన్నారు.
 
 శివసేన మెత్తబడినట్లే!:శివసేనకు కేబినెట్‌లో రెండు బెర్తులు ఖాయం చేయడంతో ఆ పార్టీ మెత్తబడింది. బీజేపీ తమకిచ్చిన హామీని నిలబెట్టుకుంటోందని, అయితే దీనిపై పార్టీలో విస్తృత చర్చ తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని శివసేనకు చెందిన సీనియర్ నేత ఒకరు తెలిపారు. మహారాష్ర్టలో మైనారిటీ బీజేపీ ప్రభుత్వానికి మద్దతిచ్చే విషయంలో శివసేన తర్జనభర్జన పడుతుతుండడం తెలిసిందే. ఈ నెల 12న అసెంబ్లీలో జరిగే విశ్వాసపరీక్షలో బీజేపీకి శివసేన మద్దతు అవసరం. అయితే అందుకు ఆ పార్టీ డిమాండ్లపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు పార్టీలు దగ్గరయ్యే అవకాశముంది. శివసేన నేతలు, సురేశ్ ప్రభు, అనిల్ దేశాయ్‌లకు బెర్తులు ఖరారయ్యాయని సమాచారం. రైల్వే మంత్రి సదానంద గౌడను తప్పించి, దాన్ని ప్రభుకు అప్పగించే అవకాశముంది.

 

మరోవైపు ఏపీ నుంచి రమరో మిత్రపక్షం టీడీపీ నుంచి సుజనాచౌదరికి గానీ, కేంద్ర మాజీ మంత్రి ఎర్రంనాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడుకు గానీ అవకాశం రానుంది. పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవ్‌దేకర్‌కు కేబినెట్ హోదా కట్టబెట్టనున్నారని సమాచారం. ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తూ వాణిజ్యశాఖను స్వతంత్ర హోదాలో నిర్వహిస్తున్న నిర్మలా సీతారామన్‌కు కేబినెట్ హోదా దక్కే అవకాశాలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement