ముంబై: ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత్‌లో భావ ప్రకటన స్వేచ్ఛను హరించే సంఘటనలు నానాటికి పెరుతుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రతిష్టాత్మకమైన టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్ (టిస్)లో మానవ హక్కుల కార్యకర్త, 'కలర్స్ ఆఫ్ కేజ్' రచయిత అరుణ్ ఫిరీరా బుధవారం నాడు చేపట్టాల్సిన పుస్తక పఠనం కార్యక్రమాన్ని అరగంట ముందు భారత ఇంటెలిజెన్స్ అధికారులు రద్దు చేశారు. ఎందుకు రద్దుచేశారో, ఇంటెలిజెన్స్ అధికారులుగానీ, టాటా ఇనిస్టిట్యూట్‌గానీ అధికారింగా ఇంతవరకు వివరణ ఇవ్వలేదు. సాహిత్యం గురించి విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు తరచుగా టిస్‌లో సాహిత్య కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు.
అందులో భాగంగా పుస్తక పఠనం కార్యక్రం ఉంటుంది. మావోయిస్టు సానుభూతిపరుడైన అరుణ్‌పై గతంలో దేశద్రోహం కేసు నడిచింది. ఆ కేసులో అరెస్టయిన అరుణ్ కొద్దికాలం జైలు జీవితం అనుభవించారు. అప్పుడు అక్కడ తనకు కనిపించిన పరిస్థితులపై అరుణ్ 'కలర్స్ ఆఫ్ కేజ్' పేరిట పుస్తకం రాశారు. ఆ పుస్తక పఠనమే బుధవారం నాటి సాహితీ కార్యక్రమం.
టిస్ విద్యార్థి నాయకుల కథనం ప్రకారం.. సరిగ్గా కార్యక్రమం ప్రారంభం కావడానికి అరగంట ముందు సివిల్ దుస్తుల్లో ఉన్న కొంతమంది ఇంటలెజెన్సీ అధికారులు కాలేజీ డీన్ కార్యాలయానికి వచ్చి పుస్తక పఠన కార్యక్రమాన్ని నిలిపివేయాల్సిందిగా కోరారు. ఈ నేపథ్యంలో కాలేజీ నిర్వాహకులు మొత్తం ఆ నాటి కార్యక్రమాలన్నింటిని రద్దు చేశారు. రద్దుకు కారణాలేమిటో మాత్రం అధికారికంగా వివరించలేదు. తనకు దీనిపై అధికారిక వివరణ కావాలంటూ టిస్ డెరైక్టర్ ప్రొఫెసర్ పరశురాం పేరిట అరుణ్ లేఖ రాశారు. దానికి సమాధానం రావాల్సి ఉంది. గత నెలలో ఇదే కాలేజీ యాజమాన్యం 'టాక్ ఆన్ ది కాశ్మీర్' కార్యక్రమాన్ని కూడా అర్ధాంతరంగా రద్దు చేసింది.
నోటికి తాళం వేస్తారా?
Published Fri, Feb 13 2015 1:25 PM | Last Updated on Sat, Sep 2 2017 9:16 PM
Advertisement