
జగన్నాథుని ఆలయ ప్రాంగణంలో ఎలుగుబంటి
ఒడిశా, జయపురం: ఆహార అన్వేషణ కోసం ఈ మధ్య కాలంలో వన్య జంతువులు కొన్ని జనారణ్యంలోకి ప్రవేశిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం జయపురంలోని పలుచోట్ల ఏనుగులు, ఎలుగుబంట్లు పంటపొలాలు, కల్లాల్లోకి చొరబడి అక్కడి పంటను తినివేశాయి. దీంతో పాటు వాటిని తరిమేందుకు ప్రయత్నించిన వారిపై కూడా అవి దాడులకు పాల్పడ్డాయి. నవరంగపూర్ జిల్లాలోని తెంతులికుంటి సమితిలో ఉన్న అంచలగుమ్మ గ్రామ జగన్నాథుని ఆలయం లోపలికి ఓ ఎలుగుబంటి ఆదివారం ఉదయం ప్రవేశించింది.
ఈ క్రమంలో దేవుని కోసం భక్తులు పెట్టిన అక్కడి ప్రసాదాన్ని చక్కగా ఆరగించింది. అయితే ఆ ఎలుగు ఆలయంలోకి ప్రవేశించేందుకు ఆలయ తలుపులను విరగ్గొట్టింది. ఇవే దృశ్యాలను చిత్రీకరించిన అక్కడి యువకులు ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ దృశ్యాలను చూస్తున్న ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.