‘పిలిచి ఉన్నపళంగా రాజీనామా చేయమన్నారు’
న్యూఢిల్లీ: బెంగళూరులో ఆంగ్ల సబ్జెక్టును బోధించే అసోసియేట్ ప్రొఫెసర్(స్వలింగ సంపర్కుడు)ను విధుల్లో నుంచి తప్పించారు. అతడి వల్ల విద్యార్థుల ఏకాగ్రతకు భంగం కలుగుతుందనే కారణంతో ఆయనను బలవంతంగా ఉద్యోగంలో నుంచి తీసివేశారు. ఈ విషయాన్ని ఆ ప్రొఫెసరే స్వయంగా చెప్పాడు. బెంగళూరులోని సెయింట్ జోసెఫ్ అనే కాలేజీ ఉంది.
అందులో ఆంగ్ల విభాగంలో ఆష్లే టెలీస్ అనే వ్యక్తి అసోసియేట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాడు. అతడు ఓ స్వలింగ సంపర్కుడు. పైగా ఎల్‌జీబీటీ హక్కుల ఉద్యమకారుడిగా కూడా ఉన్నాడు. కొన్ని విషయాలతో అతడికి వ్యక్తిగతంగా భిన్నమైన అభిప్రాయాలుండేవి. వాటిని అతడు విద్యార్థులపై రుద్దుతున్నాడని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అతడిని రాజీనామా చేయాలని కాలేజీ యాజమాన్యం ఆదేశించింది. ఈ విషయాన్ని అతడే తన మాటల్లో ఎలా చెప్పారంటే..
‘మార్చి 9, 2017న నేను బీకామ్ సెకండియర్ విద్యార్థులకు పాఠం చెబుతున్నాను. ప్రిన్సిపాల్ పిలుస్తున్నారంటూ పాఠం మధ్యలోనే పిలిచారు. అక్కడికి వెళ్లాక పది నిమిషాలు ఎదురుచూడమన్నారు. ఆ తర్వాత పిలిచి ‘నీ వ్యక్తిగత అభిప్రాయాల కారణంగా విద్యార్థుల ఏకాగ్రతకు భంగం కలుగుతోంది. వెంటనే నీ బాధ్యతలకు రాజీనామా చేసి వెళ్లిపో.. ఇది ఇప్పుడే జరగాలి’ అని చెప్పారు. వాస్తవానికి విద్యార్థులు నిజంగానే డిస్ట్రబ్ అయితే.. అలా చేయడం కూడా బోధకుల పనే. అలా చేయలేకుంటే విద్యార్థులు ఎలా ఆలోచిస్తారు? ఎప్పుడు ఈ ప్రపంచం మారుతుంది? అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన తన అనుభవాలను ఫేస్‌బుక్‌లో పంచుకున్నారు.