బెంగళూరు : కొత్త మోటారు వాహన సవరణ చట్టంతో వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ 1 నుంచి దేశ వ్యాప్తంగా అమలులోకి వచ్చినప్పటి నుంచి వాహనాలను రోడ్డు మీదకు తీసుకురావాలంటేనే భయపడిపోతున్నారు. అయితే మిగతా దేశంతో పోల్చితే రెండు రోజులు ఆలస్యంగా ఈ చట్టాన్ని అమలులోకి తెచ్చిన కర్ణాటక రాష్ట్రం జరిమానాలలో మాత్రం దూసుకుపోతోంది. ఒక్క బెంగళూరులోనే కేవలం ఒక్క వారానికి రూ.72,49,900 వసూలు చేసి బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఔరా అనిపించారు. మొత్తం 6,813 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులను రిజిస్టర్ చేసి వాహనదారుల వద్ద నుంచి అంత మొత్తాన్ని రాబట్టారు. ట్రాఫిక్ ఉల్లంఘనలలో ఎక్కువగా హెల్మెట్ లేకుండా ఉండటం, సీటుబెల్టు పెట్టుకోకపోవడం, సరైన పత్రాలు లేకపోవడం, ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, వన్‌వే రూట్‌లో రావడం తదితరాల నుంచి జరిమానాలు ఎక్కువగా వసూలు అయ్యాయి.
ట్రాఫిక్ ఉల్లంఘించిన వారి నుంచి ట్రాఫిక్ పోలీసులు కఠినంగా జరిమానా విధించడం పట్ల పాదచారులు, ప్రజా రవాణా వినియోగదారులు సంతోషంగా ఉన్నారు. ఈ భారీ జరిమానాలు మార్పును తెస్తాయని బస్సులో ప్రయాణించే ఓ ప్రయాణికుడు హర్షం వ్యక్తం చేయగా.. ఈ జరిమానాలు ఎక్కువగా సామాన్యులను ప్రభావితం చేస్తున్నాయని మరో వ్యక్తి వాపోయాడు. ‘ప్రభుత్వం లైసెన్సులను సక్రమంగా జారీ చేయదు, అలాగే ట్రాఫిక్ పోలీసులు మేం చెప్పేది వినడానికి ఇష్టపడరు’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది చదవండి : ట్రక్ డ్రైవర్‌కు భారీ జరిమానా.. తొలి వ్యక్తిగా రికార్డ్
Comments
Please login to add a commentAdd a comment