పసి వయసులోనే వృద్ధాప్యం!
చిన్న పిల్లలకు సోకే అత్యంత అరుదైన చర్మవ్యాధి బెంజమిన్ బటన్. పసివయసులోనే వృద్ధాప్యం వచ్చినట్లుగా మారిపోవడం ఈ వ్యాధి లక్షణం. ఈ చర్మవ్యాధి సోకిన చిన్నారులు వయసు పైబడినవారిలా కనిపిస్తారు. ఏడేళ్ల అంజలి కుమారి, 18 నెలల కేశవ్ కుమార్ లాంటి చాలా మంది ఇప్పుడు అదే సమస్యతో బాధపడుతున్నారు. అతి చిన్న వయసులోనే చర్మమంతా ముడతలు పడిపోయి, వయసు మీద పడినట్లు కనిపిస్తున్నారు. జన్యుపరంగా వచ్చే ఆ అరుదైన రుగ్మతతో అక్కాతమ్ముళ్లు బాధపడుతున్నారు.
జార్ఖండ్ రాంచికి చెందిన అంజలి, కేశవ్‌లను క్యూటిస్ లాక్సాగా పిలిచే అత్యంత భయంకరమైన రోగం పట్టిపీడిస్తోంది. శత్రుఘ్న రాజక్, రింకీదేవి దంపతులకు అంజలి, కేశవ్ లతో పాటు... 11 ఏళ్ల మరో కుమార్తె శిల్పి కూడా ఉంది. ఆమెలో మాత్రం పుట్టినప్పటి నుంచి ఈ వ్యాధి లక్షణాలు ఎక్కడా కనిపించలేదట. ఇండియాలో డాక్టర్లు కూడా ఈ వ్యాధిని తగ్గించడం కష్టమని చెప్పేశారు. అయితే తమను వీధిలోని వారంతా వింతగా చూస్తున్నారని, చెత్త కామెంట్లు చేస్తున్నారని అంజలి వాపోతోంది. దాది అమ్మా (బామ్మ), బుడియా (ముసలి), బందరియా (కోతి) వంటి పదాలతో పిలుస్తూ స్కూల్లో అంతా గేలి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తోంది.
తమ పిల్లలకు సోకిన ఈ వింతవ్యాధి ఎప్పటికైనా తగ్గుతుందేమోనన్న ఆశతో ఆ తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. వైద్యులు మాత్రం దీనికి ఇతర దేశాల్లో తప్ప.. భారత్‌లో మందు లేదని తేల్చిచెప్పేశారు. లాండ్రీ మ్యాన్‌గా పనిచేస్తూ నెలకు రూ. 4,500 మాత్రమే సంపాదించే శత్రుఘ్నకు విదేశాల్లో వైద్యం చేయించే తాహతు లేకపోవడంతో దిక్కు తోచని స్థితిలో ఉన్నాడు. ఎప్పటికైనా తమ పిల్లలు సాధారణ స్థితికి వస్తారని ఆ తల్లిదండ్రులు ఆశతో ఎదురు చూస్తున్నారు.