
గ్వాలియర్: మధ్యప్రదేశ్లోని శివ్‌పురిలో బుధవారం సాయంత్రం ఈ ఘోరం ప్రమాదం చోటు చేసుకుంది. శివపురి, గ్వాలియర్ పరిధిలోని సుల్తాన్‌ఘర్ జలపాతంలో కొంతమంది యువకులు కొట్టుపోయారు. మరికొందరు సంఘటనా స్థలంలోనే చిక్కుకుపోయారు. ఇప్పటివరకు ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. ఐదుగురిని రక్షించగలిగారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ దళాలు, హెలికాఫ్టర్ల సహాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఆగస్టు 15సెలవు దినం, మరోపక్క వర్షాల కారణంగా నిండుగా కళకళలాడుతున్న జలపాతాలు. దీంతో దాదాపు 20మంది యువకులు జలపాతానికి పిక్‌నిక్‌కి వెళ్లారు. అయితే హఠాత్తుగా వరద నీరు పోటెత్తడంతో 11మంది ప్రవాహంలో కొట్టుకుపోయారు. పిక్‌నిక్ వెళ్లినవారు స్నానాలు చేస్తుండగా ఉధృతంగా నీరు కిందికి ప్రవహించడంతో ఆ ప్రవాహంలో కొట్టుకుపోయారు. 100 అడుగుల ఎత్తు నుండి నీరు వేగంగా కిందికి రావడంతో ఈ ప్రమాదం జరిగింది.
మరోవైపు ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. ప్రమాదంలో చిక్కుకున్నవారిని కాపాడేందుకు నిరంతరంగా ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. రెస్య్కూ టీం ఇప్పటివరకూ ఏడుగురిని కాపాడిందనీ, పదకొండుమంది యువకులు కొట్టుకుపోయారని, మరికొందరు గల్లంతయ్యారని తెలిపారు. దాదాపు 30-40మంది ఇంకా అక్కడే చిక్కుకు పోయినట్టు చెప్పారు. మరోవైపు ఈ సాయంత్రంనుంచి భారీగా కురుస్తున్న వర్షం, చీకటి సహాయక చర్యలకు ఆటంకంగా మారినట్టు తెలుస్తోంది. ముందస్తు సమాచారం లేకుండా నీటికి దిగువకు వదలడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.