పాట్నా: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం జోక్యం ఉన్న మట్టి కుంభకోణంపై బిహార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విచారణకు ఆదేశించారు. శరవేగంగా దర్యాప్తు పూర్తి చేసి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. దీంతో లాలూకు చెందిన పార్టీ వర్గాలు తీవ్ర అసంతృప్తి లేవనెత్తే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. లాలూ విషయంలో ముందు నుంచి కాస్త వైరుద్యంగానే వ్యవహరిస్తున్నారంటూ ఇప్పటికే ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌పై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారం మరింత దూరం పెంచే అవకాశం ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
అయితే, ప్రతిపక్షాలు మాత్రం తమ ఎదురుదాడి నుంచి తప్పించుకునేందుకే నామమాత్ర దర్యాప్తునకు ఆదేశించారని విమర్శిస్తున్నారు. ఈ విషయంపై లాలూ, ఆయన కుమారులు వివరణ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. పట్నా శివారులో లాలూ కుటుంబానికి ఒక పెద్ద ప్లాట్ ఉంది. ఇందులో ఒక పెద్ద వాణిజ్య సముదాయం కడుతున్నారు. దీనిని నిర్మిస్తున్న కంపెనీకి లాలూ కుమారులు డైరెక్టర్లు.
పైగా ఒక కొడుకు అటీవీ శాఖ మంత్రికాగా, మరోకరు డిప్యూటీ సీఎం. ఈ సముదాయం నిర్మించేందుకు పునాదిలో పెద్ద మొత్తంలో మట్టితవ్వి తీశారు. ఆ మట్టిని ఎలాంటి టెండర్ పిలవకుండానే ప్రభుత్వానికి చెందిన జూపార్క్‌కు రూ.90లక్షలకు అమ్మేశారు. వాస్తవానికి జూపార్క్‌కు మట్టి అవసరం ఉందని ప్రభుత్వం ద్వారా టెండర్లు పిలవాల్సి ఉంటుంది. కానీ, అలా చేయకుండానే సొంతంగా ఈ పనిచేశారు. ఈ కుంభకోణంపై ప్రతిపక్షాలు భగ్గుమంటుండటంతో తాజాగా దర్యాప్తునకు ఆదేశించారు.
సంబధిత మరిన్ని కథనాలకై చదవండి..
కొడుకు పుణ్యమా అని వివాదంలో లాలూ