మరుగుదొడ్లు దొంగిలించారట!
వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది అక్షరాలా నిజం. తమ మరుగుదొడ్లు కనిపించడం లేదని, కాస్త వెతికిపెట్టాలంటూ ఇద్దరు మహిళలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. వివరాల్లోకెళ్తే... బిలాస్‌పూర్‌లోని అమర్‌పూర్ గ్రామానికి చెందిన 70 ఏళ్ల బేలాబాయ్ పటేల్.. తన కూతురు చందాతో కలిసి కేసు పెట్టారు. తమ మరుగుదొడ్లను ఎవరో ఎత్తుకెళ్లారంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. తమకు స్వచ్ఛభారత్ అభియాన్ కింద మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు డబ్బులు ఇవ్వాలంటూ బేలాబాయ్, చందాలు గ్రామ పంచాయతీలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే అధికారులు వారి దరఖాస్తును తిరస్కరించారు.
కారణమేంటని ఆరా తీయగా... ఇదివరకే వారికి మరుగుదొడ్లు మంజూరయ్యాయని, నిర్మాణం కూడా పూర్తయిందని, అందుకు సంబంధించిన ఫొటోలను చూపిస్తూ దరఖాస్తులను తిరస్కరించారు. దీంతో ఏం చేయాలో పాలుపోని తల్లీకూతుళ్లు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తమ మరుగుదొడ్లు కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు. దీంతో అసలు మరుదొడ్లే లేకుండా అవి పోయాయంటూ ఎలా ఫిర్యాదు చేస్తారంటూ పోలీసులు ప్రశ్నించారు. దీంతో గ్రామపంచాయతీ రికార్డులను, ఫొటోలను ఆధారంగా చూపారు. అసలేం జరిగిందని ఆరా తీస్తే ఆ ఊరిలోని వారందరికీ మరుగుదొడ్లు మంజూరైనా ఎవరెవరివో ఫొటోలు జతచేసి, అందరికీ మరుగుదొడ్లు నిర్మించినట్లు స్థానిక రాజకీయ నాయకులు, అధికారులు రికార్డులు సృష్టించారు. పేదల కోసం మంజూరైన సొమ్మునంతా నొక్కేశారు. ఈ భాగోతమంతా తల్లీకూతుళ్ల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. అసలు మరుగుదొడ్లే నిర్మించలేదంటే గ్రామ పంచాయతీ అధికారులు చిక్కుల్లో పడక తప్పదు. నిర్మించారని రికార్డులు చూపితే.. వాటిని వెతికి పెట్టక పోలీసులకు తప్పదు. తల్లీకూతుళ్లిద్దరూ అటు అధికారులను, ఇటు పోలీసులను భలే ఇరికించారు.