కొంతకాలంగా సంచలనం సృష్టిస్తున్న వర్చువల్ కరెన్సీ బిట్‌కాయిన్. కేవలం సంక్లిష్టమైన ప్రోగ్రామింగ్ కోడ్‌ల ఆధారంగా రూపొందే క్రిప్టో కరెన్సీల జాబితా లోదే ఇది కూడా. కానీ ప్రతి లావాదేవీ నిక్షిప్తమయ్యే బ్లాక్‌చెయిన్, నిర్ణీతంగా మాత్రమే అందుబాటులో ఉండడం, యజమానుల వివరాలు రహస్యంగా ఉండడం, ప్రపంచవ్యాప్తంగా చాలా సంస్థలు కరెన్సీగా మార్పిడికి అంగీకరించడంతో డిమాండ్ బాగా పెరిగిపోయింది. 2010లో ఆమోదిత లావాదేవీలు మొదలైనా.. 2015 నుంచి జైత్రయాత్ర చేసింది. దీని విలువ ఏకంగా కొన్ని లక్షల రెట్లు పెరిగిపోయింది.
ఏమేం కొనొచ్చు?
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్థలు బిట్‌కాయిన్‌ను కరెన్సీగా అంగీకరిస్తున్నాయి. లావాదేవీ జరిగిన సమయంలో బిట్‌కాయిన్ విలువ ఆధారంగా ఈ కరెన్సీ మార్పిడి ఉంటుంది. మైక్రోసాఫ్ట్, డెల్, వర్జిన్ గెలాక్టిక్, హాలిడే ఇన్, సబ్‌వే, దిపైరేట్స్ బే, బ్లూమ్‌బర్గ్, అమెరికా డిష్ నెట్‌వర్క్ వంటి ప్రముఖ సంస్థలతో పాటు వందలాది ఆన్‌లైన్ షాపింగ్ సైట్లలో బిట్‌కాయిన్‌తో లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.
ఉండేవి 2,10,00,000 మాత్రమే
అత్యంత క్లిష్టమైన ప్రోగ్రామింగ్ కోడ్‌లతో బిట్‌కాయిన్‌ను సృష్టిస్తారు. ఇలా కోడ్‌లను ఛేదించేవారిని బిట్‌కాయిన్ మైనర్లు అంటారు. ఒక రకంగా చెప్పాలంటే వజ్రాల్లా బిట్‌కాయిన్లను తవ్వి తీసేవారన్న మాట. దీని బేస్ ప్రోగ్రామ్ ప్రకారం.. మొత్తంగా 2.1 కోట్ల బిట్‌కాయిన్లను మాత్రమే సృష్టించగలరు. దీనివల్ల కూడా వీటికి ఇంత డిమాండ్.
ఇది బిట్‌కాయిన్ వికీ..
బిట్‌కాయిన్ చరిత్ర, కొనుగోళ్ల నుంచి ప్రస్తుత ధర దాకా సమాచారం అందించేందుకు ఏకంగా వికీపీడియా తరహాలో ఓ వెబ్‌సైట్ ఉంది. ఈ వెబ్‌సైట్‌ను ‘బిట్‌కాయిన్ వికీగా’ పిలుస్తారు. ఇందులో బిట్‌కాయిన్ల వినియోగం, అమ్మకం, కొనుగోళ్లు, నెట్‌వర్క్, దాని భద్రతకు తీసుకుంటున్న చర్యలు వంటి వివరాలన్నీ ఉంటాయి.
బిట్‌కాయిన్ మొదటి రిటైల్ లావాదేవీ:
2010 మే 22
నాటి ధర: 25 పైసలు (0.004 డాలర్లు)
బిట్‌కాయిన్ గరిష్ట ధర నమోదైన రోజు: 2017 డిసెంబర్ 16
ఆ రోజున విలువ: రూ. 12,20,738(19,194 డాలర్లు)
2018 జనవరి 30 నాటికి ఒక్కో బిట్‌కాయిన్ విలువ రూ. 7,14,228 (11,230 డాలర్లు)
ఏడున్నరేళ్లలో బిట్‌కాయిన్ విలువ పెరుగుదల శాతం..: 30 లక్షల రెట్లు
రెండు పిజ్జాలు.. 714 కోట్లు
బిట్‌కాయిన్‌తో మొట్టమొదట కొనుగోలు చేసిన వస్తువేమిటో తెలుసా.. పిజ్జా. 2010 మే 22న లాజ్‌లో హనైజ్ అనే బిట్ కాయిన్ మైనర్ డోమినోస్ సంస్థ నుంచి రెండు పిజ్జాలు కొన్నారు. ఆ పిజ్జాల ధర 41 డాలర్లు (సుమారు రూ.2,500). ఈ సొమ్ము కింద 10,000 బిట్‌కాయిన్లు చెల్లించారు.
ప్రస్తుతం 10 వేల బిట్‌కాయిన్ల విలువ మన కరెన్సీలో రూ. 714 కోట్లపైమాటే! ఈ లావాదేవీకి గుర్తుగా ఏటా మే22న ‘బిట్‌కాయిన్ పిజ్జా డే’గా జరుపుకొంటున్నారు.
సామ్‌సంగ్, మోటొరోలా కంపెనీలు సృష్టించాయా?
సతోషి నకమొటో’
బిట్‌కాయిన్‌ను సృష్టించినది ఎవరనేది ఇప్పటివరకు తేలక పోవడం గమనార్హం. తొలి బిట్‌కాయిన్ మైనర్ ‘సతోషి నకమోటో’ అనే మారుపేరుతో 2008లో బిట్‌కాయిన్‌ను సృష్టించారు. అసలు ఆ వ్యక్తి ఎవరనే వివరాలేవీ తెలియవు. తర్వాత మరికొందరు మైనర్లు కలసి బిట్‌కాయిన్లను సృష్టించడం మొదలు పెట్టారు. అయితే బిట్‌కాయిన్‌ను నాలుగు పెద్ద కంపెనీలు సామ్సంగ్, తొషిబా, నకమిచి, మోటోరోలా కలసి సృష్టించాయనే ప్రచార ముంది. ఈ 4 కంపెనీల పేర్లలోని తొలి అక్షరాలను తీసుకునే.. ‘సతోషి నకమొటో’ పేరుతో తొలి మైనర్ వ్యవహరించారని చెబుతుంటారు. కానీ ఎవరూ నిర్ధారించలేదు.
Comments
Please login to add a commentAdd a comment