రాయ్‌పూర్ : పేద ప్రజల నుంచి పన్నులు వసూలు చేసే లక్క్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం అనవసరమైన చట్టాలను రూపొందిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. రాయ్‌పూర్‌లో జరిగిన జాతీయ గిరిజన నృత్య మహోత్సవంలో పాల్గొన్న ఆయన కేంద్ర ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. బీజేపీ నేతలు తనపై చేస్తున్న వ్యాఖ్యలు తనను ఎంతో మనోవేదనకు గురిచేశాయని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన తాజా చట్టాలను తప్పుబట్టారు. పత్రాలలో ఏ చిన్న పొరపాటు జరిగినా ప్రజలు లంచం ఇవ్వాల్సిందేనని అన్నారు. ఇది ప్రజలపై దాడి చేయడమేనని అభిప్రాయపడ్డారు. దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నా.. ఇవేవి ప్రధాని నరేంద్ర మోదీకి అర్థం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా రాహుల్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఘాటుగా స్పందించారు. దేశంలో అస్థిరతను సృష్టించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని విమర్శించాడు. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్‌పీఆర్‌పై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రజలు మద్దతు ఉందని పేర్కొన్నారు. ఎన్‌పీఆర్ ఎలాంటి ద్రవ్య లావాదేవీలను జరపదని, కేవలం పేదలను గుర్తించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యమని వివరించారు. 2010నుంచి జరుగుతున్న విధానాన్నే తాము కొనసాగిస్తున్నామని తెలిపారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఎప్పుడూ అబద్దాలు ఆడేవారని, అధ్యక్షుడిగా లేని సమయంలో కూడా అదే కొనసాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. కాగా తమ పార్టీ వ్యాఖ్యలు రాహుల్‌ను ఇబ్బంది పెట్టాయన్న ఆరోపణలకు స్పందిస్తూ..రాహుల్ వ్యాఖ్యలు దేశాన్ని ఇబ్బంది పెడుతున్నాయని సమాధానమిచ్చారు.
చదవండి: మీ భవిష్యత్తును నాశనం చేస్తున్నారు: రాహుల్
Comments
Please login to add a commentAdd a comment