'స్వచ్ఛ భారత్ ను ప్రధాని ఓ ఆయుధంగా మలిచారు'
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించిన 'స్వచ్ఛ భారత్' కార్యక్రమంపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర పర్యావరణ శాఖామంత్రి ప్రకాశ్ జవదేకర్ ఖండించారు. 'ప్రజల ఆలోచనా విధానాన్ని, అభిరుఛులను మనం మార్చాల్సిన బాధ్యత ఉంది. దేశం పరిశుభ్రంగా ఉంటే, ప్రజల మనస్సుల్లో కూడా స్వచ్చత ఉంటుంది. ఈ కార్యక్రమం అవినీతిపై పోరాటానికి ప్రారంభం లాంటిది. ఒక్కరితో ఏది సాధ్యం కాదనే , రాహుల్ కు భోదపడటం లేదు' అని జవదేకర్ అన్నారు.
దేశంలో మార్పుకు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రధాని ఓ ఆయుధంగా మార్చారని ఆయన అభిప్రాయపడ్డారు. వాతావరణం, నీటి కాలుష్యాన్ని తగ్గించాలని, ఎనర్జీ, నీటి వనరులను రక్షించాలని ఆయన సూచించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నేతలు ఫోటోలు దిగడానికి, ప్రచారానికి మాత్రమే వాడుకుంటున్నారని జవహర్ లాల్ నెహ్రూ 125వ జన్మదిన వేడుకల్లో రాహుల్ గాంధీ విమర్శించిన సంగతి తెలిసిందే.