'లోక్‌సభ ఎన్నికలకు సిద్ధంగా ఉండండి'
కోల్ కతా: లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ ఏ సమయంలోనైనా విడుదల కావచ్చని భారతీయ జనాతాపార్టీ అభిప్రాయపడింది. లోక్ సభ ఎన్నికల ప్రకటన వెలువడటానికి ఎంతో సమయం లేదని, పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు సూచించారు. బీజేపీ పార్టీ కార్యకర్తలతో శుక్రవారం సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. లోక్ సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడటమే తరువాయి అని తెలిపారు. ముందుగా డిసెంబర్ లో ఎన్నికల ప్రకటన వెలువడితే.. ఇప్పటికి 100 రోజులు మాత్రమే ఉంటాయని, ఒకవేళ అలా కాకుండా మార్చిలో వెలువడితే 150 రోజులుంటాయని తెలిపారు. ఏది ఏమైనా నోటిఫికేషన్ త్వరలో వెలువడే అవకాశం ఉందన్నారు.
తమ పార్టీ ఇప్పటికే పూర్తి స్థాయి కసరత్తు చేసి, రాబోవు ఎన్నికలకు సిద్ధంగా ఉందన్నారు. దేశ వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నట్లు వెంకయ్య తెలిపారు. తృణమూల్ కాంగ్రెస్ తో జత కట్టే అవకాశం ఉందన్న వార్తలకు ఆయన తెరదించారు. కోల్ కతాలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోమని ఆయన తెలిపారు. ఇక్కడ ఒంటరిగానే బీజేపీ 42 స్థానాల్లో పోటీ చేస్తుందన్నారు.