'తమిళనాట కమలం వికసించాలి'
చెన్నై: మహారాష్ట్ర, హర్యానా శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ... ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలలో కూడా పాగా వేయాలని తలపోస్తుంది. ఆ దిశగా అడుగులు వేసేందుకు ఆ పార్టీ చకచక పావులు కదుపుతుంది. 2016లో తమిళనాడు శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల పరిశీలకుడు, కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ అధ్యక్షతన ఆ పార్టీ నేతలు బుధవారం చెన్నైలో సమావేశమైయ్యారు. రాష్ట్రంలోని డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలకు ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీని నిలబెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన స్థానిక నాయకులతో చర్చించారు.
తమిళనాడు శాసనసభలోని మొత్తం 234 స్థానాలకు గాను 120 సీట్లు కైవసం చేసుకునే దిశగా క్యాడర్ను సమాయత్తం చేయాలని ప్రతాప్ రూడీ సదరు నాయకులకు సూచించారు. తమిళనాడులో ప్రస్తుతం ఉన్న పార్టీలకు బీజేపీ ఒక్కటే ప్రత్నామ్నాయ పార్టీ అని బీజేపీ నాయకుడు మురళీదరరావు స్పష్టం చేశారు. తమిళనాడులో ప్రాంతీయ పార్టీల హవానే నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఏఐఏడీఎంకే అధినేత్రి జయలలిత అక్రమ ఆస్తుల కేసులో జైలు శిక్ష పడింది.
ఆపై బెయిల్పై విడుదల అయిన విషయం విదితమే. అంతేకాకుండా ఆమె కొన్ని ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు పడింది. దీంతో ఆమె రానున్న ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు లేవు. అలాగే తమిళనాట మరో పార్టీ డీఎంకే కూడా కుటుంబ రాజకీయాలతో సతమతమవుతుంది. ఇదే అదనుగా భావించిన పార్టీ అగ్రనాయకులు తమిళనాట కమలం వికసింప చేయాలని భావిస్తున్నారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.