ఈశాన్య రాష్ట్రంలో విజయం ఎవరిది?
అసోం పీఠాన్ని ఇప్పటికే బీజేపీ దక్కించుకుంది. త్వరలో జరగబోయే మణిపూర్ ఎన్నికల్లోనూ ఆ పార్టీయే గెలుస్తుందని ఇండియాటుడే - యాక్సిస్ పోల్ సర్వే చెబుతోంది. ఇప్పటికిప్పుడే ఎన్నికలు నిర్వహిస్తే.. ఆ రాష్ట్రంలో 31-35 సీట్లు గెలుచుకుని అధికారం చేపడుతుందని తెలిపింది. 60 మంది సభ్యులున్న మణిపూర్ అసెంబ్లీలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి 50 మంది ఎమ్మెల్యేలున్నారు. ఈ సర్వే అంచనాలు నిజమైతే అది కాంగ్రెస్‌కు పెద్ద ఎదురుదెబ్బే అవుతుంది. మరో ఆరు నెలల్లో మణిపూర్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేశారు. దాంతో మణిపూర్ అసెంబ్లీలో ఉండాల్సిన ఎమ్మెల్యేల సంఖ్య 60కి బదులు ఇప్పుడు 53 అయ్యింది. కాంగ్రెస్ నుంచి ముగ్గురు, నాగా పీపుల్స్ ఫ్రంట్ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు.
రాబోయే ఎన్నికల్లో మణిపూర్ కాంగ్రెస్ పార్టీకి మహా అయితే 19-24 స్థానాల కంటే ఎక్కువ రావని సర్వే తేల్చేసింది. బీజేపీకి 40 శాతం ఓట్లు వస్తే.. కాంగ్రెస్‌కు 37 శాతం వస్తాయని అంచనా వేసింది. కాంగ్రెస్ ముక్త భారతదేశం రావాలన్న బీజేపీ నినాదాన్ని రాష్ట్రంలో 37 శాతం మంది ఆమోదిస్తున్నారు. ఇన్నర్‌లైన్ పర్మిట్ అంశం ఇప్పటికీ అక్కడ ఎన్నికలో ప్రధానాంశంగా మారింది. 62 శాతం మంది ఓటర్లు అదే ముఖ్యాంశమని చెప్పారు. రెండో ప్రధానాంశం మౌలిక సదుపాయాలు, తర్వాత ఉపాధి అవకాశాలు. సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని తీసేయాలన్న అంశానికి కేవలం 6 శాతం మంది మాత్రమే మద్దతు పలికారు. ఒకప్పుడు ఐరన్ లేడీ ఆఫ్ మణిపూర్ అని ప్రసిద్ధి చెందిన ఇరోమ్ షర్మిలా చాను రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని చెప్పేవాళ్లు కేవలం 1 శాతమే ఉన్నారు. ఆమె ఏళ్లతరబడి చేసిన నిరాహార దీక్ష అసలు ఎన్నికల అంశమే కాదని 75 శాతం మంది చెప్పారు.