'బాద్షా ఇక్కడున్నా మనసంతా పాక్ పైనే'
ఇండోర్: ప్రముఖ హీరో, బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ పై బీజేపీ నేత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. షారుక్ ఖాన్ భారత్లో ఉంటున్నా ఆయన మనసంతా పాకిస్తాన్ మీదే ఉందని మధ్యప్రదేశ్ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు కైలాశ్ విజయ్ వర్గియా వ్యాఖ్యానించారు.
ఇప్పటికే విశ్వహిందూ పరిషత్ నేత, బీజేపీ మహిళా నాయకురాలు సాద్వీ ప్రాచీ, షారూక్ ఖాన్ దేశం నుంచి వెళ్లిపోవచ్చంటూ విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. దేశంలో ప్రజ్వరిల్లుతున్న మత ఘర్షణలను షారూక్ ఖండించిన నేపథ్యంలో సాద్వీ ప్రాచీ ...షారుక్‌పై మండిపడ్డారు.
కాగా సృజన, మతాలపై అసహనం దేశానికి హానికరమని షారుక్ ఖాన్ వ్యాఖ్యానించిన విషయం విదితమే. సోమవారం తన 50వ పుట్టినరోజు సందర్భంగా కింగ్‌ఖాన్.. ప్రస్తుతం దేశంలో తీవ్ర అసహనం నెలకొందన్నారు. సినీరంగానికి చెందిన వారు, శాస్త్రవేత్తలు, రచయితలు అవార్డులు వెనక్కి ఇవ్వడాన్ని సమర్థించారు. వెనక్కి ఇవ్వడానికి తనకు జాతీయ ఫిల్మ్ అవార్డు ఏమీ లేనప్పటికీ, అలా చేసిన సినీ ప్రముఖులు దివాకర్ బెనర్జీ, ఆనంద్ పట్వర్ధన్‌ల నిర్ణయాన్ని తాను గౌరవిస్తానన్నారు. సృజన పట్ల, మతం పట్ల అసహనం ప్రదర్శిస్తున్నామంటే దేశం వేసిన ప్రతి ముందడుగు మనం వెనక్కి లాగుతున్నట్లేనన్నారు. దీంతో షారుక్ వ్యాఖ్యలను విజయ్ వర్గియా తీవ్రంగా ఖండించారు.