
బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ (పాత ఫొటో)
లక్నో : దేశంలో సంచలనం సృష్టించిన కథువా, ఉన్నావ్ అత్యాచార ఘటనలపై బీజేపీ నేతలు విచిత్రమైన రీతిలో స్పందిస్తున్నారు. నిన్న అత్యాచారాలు సంస్కృతిలో భాగం అని ఒకరంటే, నేడు అసలు ఆడపిల్లలను బయటికి పంపకుండా ఇంట్లోనే ఉంచి కాపల కాయలంటూ ఉత్తర్‌ప్రదేశ్‌లోని బైరియా నియోజకవర్గ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. ఉన్నావ్ ఘటనపై స్పందించిన ఆయన తన పార్టీ ఎమ్మెల్యే ఉన్నావ్ అత్యాచార కేసులో నిందితుడు (కుల్దీప్ సింగ్ సెంగర్)ను వెనకేసుకోస్తూ.. అది ఒక కుట్ర అని, అసలు ఎవరైన ముగ్గురు పిల్లల తల్లిని అత్యాచారం చేస్తారా అని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులకు వారి తల్లిదండ్రులే బాధ్యత వహించాలని, అసలు ఆడపిల్లలను స్వేచ్ఛగా తిరగకుండా వారిని కట్టడి చేయాలని అన్నారు. పదిహేనేళ్ల పిల్లలను వారి తల్లిదండ్రులు ఇంట్లోనే ఉంచి కాపలా కాయాలని, అలా కాకుండా వారిని ఇష్టం వచ్చినట్టు గాలికి వదిలేస్తున్నారని ఆరోపించారు. ఆడపిల్లలపై ఆత్యచారాలు జరగడానికి ఇదే ప్రధాన కారణం అని అన్నారు. అలాగే పిల్లలకు ఫోన్లు కొనివ్వకూడదని సూచించారు.