
అధిక జనాభాకు వాళ్లే కారణం!
దేశంలో అధిక జనాభాకు వాళ్లే కారణమని పరోక్షంగా ముస్లింలను ఉద్దేశించి బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్
ముస్లింలపై సాక్షి మహరాజ్ పరోక్ష వ్యాఖ్యలు
మీరట్: దేశంలో అధిక జనాభాకు వాళ్లే కారణమని పరోక్షంగా ముస్లింలను ఉద్దేశించి బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. శుక్రవారం మీరట్‌లో జరిగిన ‘సంత్ సమ్మేళన్’లో మాట్లాడుతూ... ‘నలుగురు భార్యలు... 40 మంది పిల్లలు ఉన్నవారే దేశంలో జనాభా పెరుగుదలకు కారకులు. ఇందుకు హిందువులు బాధ్యులు కారు. ’అన్నారు. దీనికి సంబంధించి వెంటనే నివేదిక పంపించాలని మీరట్ జిల్లా అధికారులను ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఎన్నికల ప్రచారంలో కుల, మతాల పేరు చెప్పి ఓట్లడగటం నేరమని సుప్రీంకోర్టు ఇటీవల ఉత్తర్వులిచ్చిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.
విరుచుకుపడిన విపక్షాలు...
ఈ వ్యాఖ్యలపై విపక్షాలు విరుచుకుపడ్డాయి. ఆయన మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఆయన ప్రసంగం అభ్యంతరకరంగా, సుప్రీం ఆదేశాలను ఉల్లంఘించేలా ఉందని, దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని కాంగ్రెస్ నాయకుడు కేసీ మిట్టల్ చెప్పారు. బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రి ముఖ్తర్ అబ్బాస్ నక్వీని వివరణ కోరగా... తాను ఆ వ్యాఖ్యలు చదవలేదని, అవి కేవలం ఆయన వ్యక్తిగత అభిప్రాయమని తెలిపారు.