
తిరువనంతపురం: శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలను అనుమతించడంపై బీజేపీ నిరసన గళం మరింత పెంచింది. అయ్యప్ప ఆలయ సంప్రదాయాలను, ఆచారాలను పరిరక్షించాలనే నినాదంతో రథయాత్రను ప్రారంభించాలని నిర్ణయించింది. అయ్యప్ప భక్తుల నిరసనలకు మద్దతుగా ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా మాట్లాడిన మరునాడే ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం. ఎన్‌డీఏ పక్షాల మద్దతుతో నవంబర్ 8 నుంచి కాసర్‌గోడ్ నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర నవంబర్ 13న పత్తనంతిట్టలో ముగియనుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీఎస్ శ్రీధరన్ పిళ్లై తెలిపారు. కాగా, శనివారం రాత్రి అమిత్‌షా నేతృత్వంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఇస్రో మాజీ చైర్మన్ జి.మాధవన్ నాయర్, ట్రావెన్‌కోర్ దేవస్వోమ్ బోర్డ్ మాజీ అధ్యక్షుడు, కేపీసీసీ సభ్యుడు రామన్ నాయర్ బీజేపీలో చేరారు.