* ‘డెంగీ’ దోమల నివారణకు ఉపయోగించే నూనెలో నాణ్యత డొల్ల
* ఇప్పటికే రూ.26 కోట్లు చెల్లించిన బీఎంసీ
* పనిచేయడం లేదని తెలిసినా వాడుతున్న వైనం
* బీఎంసీ తీరుపై విమర్శల వెల్లువ
సాక్షి, ముంబై: బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) దోమల నివారణకు ఉపయోగించే నూనెలో నాణ్యత లోపించిందని పలువురు ఆరోపిస్తున్నారు. దీంతో దోమల నివారణ జరగక రోజురోజుకు నగరంలో డెంగీ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దోమల నివారణకు కెమికల్స్‌ను సరఫరా చేస్తున్న సదరు కంపెనీపై గత ఏడాది కూడా తక్కువ నాణ్యత కెమికల్స్‌ను సరఫరా చేసినందుకు గాను జరిమానా విధించారు. అయినా కార్పొరేషన్‌కు ఆ కంపెనీ ఇప్పటికీ అదే నూనెను సరఫరా చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
2013 మార్చిలో కార్పొరేషన్ 2.57 లక్షల లీటర్ల ఆయిల్‌ను సరఫరా చేసేందుకు ‘యూనివర్సల్ ఆర్గానిక్స్’ అనే సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చింది. రెండేళ్లకు గాను రూ.26 కోట్లను చెల్లించింది. కాగా ఈ కంపెనీ సరఫరా చేస్తున్న ఆయిల్‌లో కల్తీ ఉందని తేలడంతో సదరు కంపెనీకి అదే ఏడాది జూన్‌లో కార్పొరేషన్ జరిమానా విధించింది. రూ.65 లక్షల జరిమానాను డిపాజిట్ చేయాలని కార్పోరేషన్ సదరు కంపెనీని ఆదేశించింది. అయితే, ఇప్పటికీ అదే కంపెనీ సరఫరా చేస్తున్న ఆయిల్‌నే ఉపయోగించడం గమనార్హం.
ఈ సందర్భంగా స్థానిక బీజేపీ నేత మనోజ్ కోటక్ మాట్లాడుతూ.. గతంలో కల్తీ మందును సరఫరా చేయడంతో 2011లో పుణే మున్సిపల్ కార్పొరేషన్, సూరత్ ఈ కంపెనీ ఉత్పత్తులపై నిషేధం విధించాయన్నారు. ఈ కంపెనీకి శక్తి వంతమైన మందును సరఫరా చేసే సామర్ధ్యం లేదని మధ్య ప్రదేశ్ ప్రభుత్వం కూడా తేల్చి చెప్పిందన్నారు. నగరంలో రోజురోజు డెంగీ బారిన పడిన వారి సంఖ్య పెరుగుతూఉంటే మరో పక్క బీఎంసీ దోమల నివారణకు కల్తీ ఆయిల్‌తో కూడిన పొగను విడుదల చేసేందుకు విస్తృతంగా డ్రైవ్‌ను ప్రారంభించిందని మనోజ్ కోటక్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
బీఎంసీ నిర్లక్ష్యం వల్లే దోమల వృద్ది జరిగి నగరంలో డెంగీ కేసులు పెరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఆయిల్ అంత ప్రభావం చూపదని తెలిసినా ఇంకా దానిపై ప్రజాధనాన్ని వెచ్చించడంపై ఆయన ఆవేదన వ్యక్తం తెలిపారు. అంతేకాకుండా ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని, నూనె నమూనాను పరీక్షలకు పంపించాలని డిమాండ్ చేశారు. అలాగే, కల్తీ నూనె వాడకానికి బాధ్యులైన వ్యక్తులపై కూడా చర్యలు తీసుకోవాలని సూచించారు.
కల్తీ నూనె అని తెలిసినా..
Published Sun, Nov 9 2014 11:00 PM | Last Updated on Wed, Apr 3 2019 4:53 PM
Advertisement
Advertisement