
ముంబై వరదలతో నీట మునిగిన సబర్బన్ రైల్వే ట్రాక్‌లు
సాక్షి, ముంబై : చినుకు పడితే రైల్వే ట్రాక్‌లపై నీరు నిలిచి రైలు సర్వీసులకు బ్రేక్ పడుతుండటంపై బాంబే హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ముంబై నగరంలో ఇటీవల వరదలతో రైల్వే ట్రాక్‌లపైకి నీరు నిలిచిపోవడంతో పలు రైళ్ల రాకపోకలు రద్దయిన క్రమంలో ప్రయాణీకుల ఇబ్బందులను ప్రస్తావించింది. నీటిలో మునిగిన ట్రాక్‌లపైనా రైళ్లు నడిచే సాంకేతికత అంతర్జాతీయంగా అందుబాటులో ఉందా..?..త్వరలో నిర్మించే బుల్లెట్ ట్రైన్‌ను వరద నీటిలో నడిపిస్తారా..? అంటూ హైకోర్టు అధికారులను ప్రశ్నించింది.
కాంగ్రెస్ నేత స్మితా మయాంక్ ధ్రువ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారిస్తూ జస్టిస్ నరేష్ పాటిల్, జస్టిస్ గిరీష్ కులకర్ణిలతో కూడిన బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. వరదలతో తలెత్తే సమస్యలను పరిష్కరించేందుకు పశ్చిమ, మధ్య రైల్వే అధికారులతో సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది.
పశ్చిమ, మధ్య రైల్వే జనరల్ మేనేజర్ల భేటీ త్వరలో జరుగుతుందని, ఈ సమావేశంలో రైల్వే బ్రిడ్జిలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లు, ఫ్లాట్‌ఫాం ఎత్తు, మహిళల భద్రత వంటి పలు అంశాలపై చర్చిస్తారని కేంద్రం తరపున హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ చెప్పారు. ఇటీవల అంథేరి బ్రిడ్జి కూలిన అంశాన్ని ప్రస్తావించిన బెంచ్ అన్ని బ్రిడ్జిల స్థితిగతులపై రైల్వేలు తక్షణమే వ్యవస్ధాగత ఆడిట్ నిర్వహించాలని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment