షీనా బోరా హత్య కేసులో ముంబై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కూతురి హత్య కేసులో అరెస్టయిన ఇంద్రాణి ముఖర్జీ కుమారుడు మిఖైల్ బోరాను పోలీసులు అదుపులోకి తీసుకొని ఇప్పటికే పలుమార్లు విచారించిన విషయం తెలిసిందే. అయితే ఈరోజు మరోసారి మిఖైల్ ను ముంబై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. శుక్రవారం ఉదయం గువహటి ఎయిర్ పోర్టునుంచి ముంబైకి చేరుకున్న మిఖైల్ పోలీసుల ముందు హాజరయ్యాడు.
ఇంతకు ముందే మిఖైల్ ను రెండుసార్లు పోలీసులు విచారించారు. షీనా బోరా, మిఖైల్ కలసి పెరిగిన వారి తాతగారి ఊరైన దిస్ పూర్ పోలీస్ స్టేషన్ లో గురువారం సాయంత్రం అతడిని విచారణ జరిపిన విషయం తెలిసిందే. షీనా బోరా, తానూ ఇంద్రాణీ ముఖర్జీ సంతానమే అనేందుకు కావలసిన సర్టిఫికెట్లను ఈ సమయంలో మిఖైల్ పోలీసులకు సమర్పించారు. అలాగే షీనాకు, ఆమె తల్లి ఇంద్రాణీకి మధ్య జరిగిన ఈ మెయిల్ సంభాషణను, షీనాబోరా, ఇంద్రాణీ, పీటర్ ముఖర్జీల ఫొటోలను పోలీసులకు అప్పగించారు. అయితే 2002 లో తన తల్లి ఇంద్రాణీ ...షీనా బర్త్ సర్టిఫికెట్ ను ఫోర్జరీ చేసి తమ గ్రాండ్ పేరెంట్స్ కు ఇచ్చినట్లుగా మిఖైల్ అనుమానం వ్యక్తం చేశారు.