బీఎస్ఎఫ్ సిబ్బందికి యోగా శిక్షణ!
హరిద్వార్ః దేశంలోనే అతిపెద్ద కాపలా శక్తిగా ఉన్న సరిహద్దు భద్రతా బలగాల (బీఎస్ ఎఫ్) కు యోగాలో శిక్షణనిస్తున్నారు. గురు రాందేవ్ బాబా శిక్షణలో సుమారు 1900 మంది కి ఈ ప్రత్యేక సౌకర్యాన్ని కల్పించారు. శరీరానికి మెదడుకు మధ్య సమన్వయాన్ని కుదిర్చి, సమతుల్యతకు ఎంతగానో సహకరించే యోగా...ఆరోగ్యవంతమైన జీవనం గడపడానికి ఉపయోగపడుతుందన్న విషయం తెలిసిందే. అందుకే ఇప్పుడు తీవ్రమైన ఒత్తిడితో, కష్టించి పనిచేయాల్సిన సరిహద్దు భద్రతా బలగాలకు సైతం యోగా శిక్షణనిచ్చేందుకు నిర్ణయించారు.
బీఎస్ఎఫ్ సిబ్బందికి పదిరోజులపాటు కొనసాగే యోగా శిక్షణా కార్యక్రమం శనివారం హరిద్వార్ లో ప్రారంభమైంది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఏపీ మహేశ్వరి ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమం జరగుతున్నట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు. సిబ్బందికి ఇచ్చే శిక్షణలో భాగంగా యోగాను కూడా నేర్పించనున్నట్లు ఇటీవల ఢిల్లీలో బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ కె కె శర్మ వెల్లడించారు. తమ బలగాలకు యోగాలో కూడా తర్ఫీదునిచ్చేందుకు నిర్ణయించామని, ప్రతి ప్లాటూన్ లోనూ ఓ శిక్షకుడు ఉండేట్లుగా పారామిలటరీ బలగాలకు శిక్షణనివ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. ప్లాటూన్ లోని ఒక్కో టీమ్ సుమారు 35 మంది సిబ్బందితో కూడి ఉండేట్లుగా కార్యాచరణ రూపొందించినట్లు వెల్లడించారు. ఒత్తిడినుంచి ఉపశమనం కలిగించేందుకు యోగా ఎంతో ఉపయోగపడుతుందని తాజా సెషన్ ప్రారంభం సందర్భంగా బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ తెలిపారు.
సరిహద్దు కాపలా విధులు నిర్వహించడంలో భాగంగా బీఎస్ఎఫ్ లో పనిచేసే పురుషులు, మహిళలు ఎంతో ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుందని, కొన్ని ప్రాంతాల్లో విధినిర్వహణ ఎంతో కఠినంగా ఉంటుందని ఆ పరిస్థితుల్లో పనిచేసేవారికి యోగా ఒత్తిడిని తగ్గించే మంచి ఆయుధంగా పనిచేస్తుందని వివరించారు.