
సాక్షి, న్యూఢిల్లీ : డ్రైవర్ ముస్లిం అయినందున ఓలా క్యాబ్ బుకింగ్‌ను అభిషేక్ మిష్రా ఇటీవల రద్దు చేసుకున్నారు. విశ్వహిందూ పరిషత్ సభ్యుడైన మిష్రా ఈ విషయాన్ని ఏప్రిల్ 20వ తేదీన ట్వీట్ చేశారు. ఇది సోషల్ మీడియాలో పెద్ద తుపానునే సృష్టించింది. హిందూ, ముస్లింల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారంటూ ఆయన మీద వేల మంది దుమ్మెత్తి పోశారు. ఆయనకు మద్దతుగా కూడా స్పందనలు వచ్చాయి. మూడు రోజులపాటు ఈ రాద్ధాంతాన్ని మౌనంగా గమనించిన ఓలా క్యాబ్ కంపెనీ యజమాన్యం స్పందించి సమాధానంగా మిష్రాకు ఓ ట్వీట్ పంపించింది.
‘మన దేశంలాగా ఓలా కూడా ఓ లౌకిక వేదిక. మేము కులం, మతం, లింగ వివక్షతల ప్రాతిపదికన మా డ్రైవర్ భాగస్వాములను, వినియోగదారులను వేరుచేసి చూడం. అన్ని వేళల్లో పరస్పర గౌరవ మర్యాదాలతో మెలగాల్సిందిగా ఇటు డ్రైవర్లను అటు మా వినియోగదారులను కోరుతాం’ అన్నది ఓలా యాజమాన్యం సమాధానం. కుల, మతాలు, లింగ వివక్షతల కారణంగా ఏ సంస్థ, ఏ కంపెనీ కూడా తమ వ్యాపారాన్ని కోల్పోదు. కాని వ్యాపారం కోసం నేడు రాజకీయ, సామాజిక అంశాలపై కూడా తమ వైఖరేమిటో చెప్పుకోవాల్సి వస్తోంది. ఈ ట్రెండ్ విదేశాల్లో ఎక్కువగా ఉంది.
భారత దేశం జెండా బొమ్మ కలిగిన డోర్‌మ్యాట్స్‌ను కెనడాలో అమెజాన్ కంపెనీ అమ్ముతున్నట్లు తెలియడంతో భారతీయులు గొడవ చేశారు. దాంతో ఆ ఉత్పత్తులను అమెజాన్ కంపెనీ తొలగించింది. కెనడా వెబసైట్ల నుంచి ఫొటోలను తొలగించింది. 2016లో బాలివుడ్ నటుడు ఆమీర్ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, అది సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ‘స్నాప్‌డీల్’ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ హోదా నుంచి ఆయన్ని తొలగించింది. మైనారిటీ మతస్థుడిగా భారత్‌లో బతకడం సురక్షితం కాదని ఆయన వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే.
అమెరికా ప్రభుత్వం గతేడాది కొన్ని ముస్లిం మెజారిటీ దేశాలపై ‘ట్రావెల్ బ్యాన్’ విధించిన విషయం తెల్సిందే. గతేడాది జనవరిలో ఈ బ్యాన్‌ను ‘లిఫ్ట్’ అనే క్యాబ్ సంస్థ వ్యతిరేకించడంతోపాటు వ్యతిరేకంగా కోర్టులో పోరాడుతున్న ఓ ఎన్జీవో సంస్థకు విరాళం కూడా ఇచ్చింది. అదే సమయంలో ట్రావెల్ బ్యాన్‌ను మరో క్యాబ్ సర్వీస్ సంస్థ ‘ఉబర్’ సమర్థించింది. దీంతో ఆగ్రహించిన అమెరికా ఉదారవాదులు ‘డిలీట్ ఉబర్ యాప్’ అంటూ పిలుపునిచ్చారు. దీంతో వారం రోజుల్లోనే రెండు లక్షల మంది అమెరికా ప్రయాణికులు తమ స్మార్ట్ ఫోన్ల నుంచి ఉబర్ యాప్‌ను డిలీట్ చేశారు. దాంతో బిజినెస్ బాగా పడిపోయింది.
అదే సమయంలో సమీప ప్రత్యర్థి అయిన ‘లిఫ్ట్’ బిజినెస్ పెరిగింది. వెంటనే ఉబర్ సంస్థ తన వైఖరిని మార్చుకొని నిషేధానికి వ్యతిరేకంగా ప్రకటన జారీ చేసింది. అంతే కాకుండా కోర్టులో నిషేధాన్ని ఎత్తివేయాలంటూ పోరాడుతున్న సంస్థకు ‘లిఫ్ట్’కన్నా ఎక్కువ విరాళాన్ని అందజేసింది. అమెరికాలోని ఓ ఆహార సంస్థ గే హక్కులను వ్యతిరేకించడం ద్వారా తన అమ్మకాలను పెంచుకుంది. మొజిల్లా అనే ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ స్వలింగ వివాహాల వ్యతిరేక ఉద్యమానికి నిధులిచ్చి నష్టపోయింది. వెంటనే నిధులను నిలిపివేసింది. చైనాలో కొన్ని విదేశీ కంపెనీలు థైవాన్, టిబెట్లను వేర్వేరు దేశాలుగా పేర్కొనడం పట్ల ఆ కంపెనీలపై చైనా వినియోగదారులు మండిపడ్డారు. దేశాలు, సరిహద్దుల పేరిట తాము వినియోగదారులను విడదీయడం లేదంటూ ఆ కంపెనీలు వివరణ ఇచ్చుకున్నాయి. టిబెట్ చైనా ఆధీనంలోనే ఉన్నదనే విషయం తెల్సిందే.
రాజకీయంగా, సామాజికంగా తమ వైఖరేమిటో వెల్లడించకుండా ఇక అమెరికాలో ఏ కంపెనీ తమ ఉత్పత్తులను అమ్ముకోలేదని ఇటీవల అమెరికాలో నిర్వహించిన ఓ సర్వేలో మూడింట రెండు వంతల మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో ఏ కంపెనీ అయినా ఇదివరకు తటస్థంగా ఉండే తమ ఉత్పత్తులను అమ్ముకునేది. అప్పుడు ఉత్పత్తుల నాణ్యతను, ధరను బట్టే వినియోగదారులు కొనుక్కునేవారు. ఇప్పుడు సోషల్ మీడియా విస్తరిస్తున్న నేపథ్యంలో ట్రెండ్ కూడా మారుతోంది. సోషల్ మీడియా అభిప్రాయలకు విలువనిస్తున్న కంపెనీలకే ఆదరణ పెరుగుతోంది. ఈ కొత్త ట్రెండ్‌ను పాశ్చాత్య మేధావులు ‘సోషల్ క్యాపిటలిజమ్ (సామాజిక పెట్టుబడిదారి విధానం)’గా వ్యవహరిస్తున్నారు.