వారికి ఎర్త్...వీరికి బెర్త్...
రానున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 2019 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రదాని నరేంద్ర మోదీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై దృష్టిసారించారు.
న్యూఢిల్లీ: రానున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 2019 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రదాని నరేంద్ర మోదీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై దృష్టిసారించారు. ఎన్నికలకు ముందు ఇదే చివరి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కావడంతో పార్టీని, ప్రభుత్వాన్ని ముందుకు నడిపించేలా సమర్థులైన టీమ్ కోసం మోదీ కసరత్తు చేశారు. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నగుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్నాటకల నుంచి పలువురికి మోదీ కేబినెట్‌లో చోటు కల్పించవచ్చని, నిర్మలా సీతారామన్ వంటి వారిని పార్టీ కార్యకలాపాల కోసం కేటాయించవచ్చని భావిస్తున్నారు.
ఇక పార్టీ సిద్ధాంతకర్త, ఆర్‌ఎస్‌ఎస్ నేపథ్యం కలిగిన రామ్‌మాధవ్‌కు కేబినెట్ బెర్త్ దక్కేఅవ కాశం ఉంది. క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో కుల, ప్రాంతీయ సమీకరణల కన్నా ప్రతిభ, సామర్థ్యానికే మోదీ పెద్దపీట వేస్తారని చెబుతున్నారు. ఎన్నికల్లోగా తక్షణ ఫలితాలు అందించగల సమర్థుల వైపు మోదీ మొగ్గుచూపారు. వ్యవసాయం, భారీ, మధ్యతరహా పరిశ్రమలు, నైపుణ్య శిక్షణ, పట్టణాభివృద్ధి వంటి శాఖలను పరిగెత్తించగల బలమైన నాయకులను మోదీ ఎంచుకున్నట్టు భావిస్తున్నారు.
ఆదివారం కొలువు దీరే కేబినెట్‌లో కొత్త భాగస్వాములు జేడీ(యూ), ఏఐఏడీఎంకే నేతలకు చోటు దక్కనుంది. ఏఐఏడీఎంకే కేబినెట్‌లో చేరితే ఆ పార్టీ నుంచి తంబిదురై, కే వేణుగోపాల్‌కు అవకాశం లభించవచ్చు. జేడీ(యూ) నుంచి కనీసం ఇద్దరు మంత్రివర్గంలో చేరవచ్చు.