
పంటబీమా అమలు దారుణం: కాగ్ అక్షింతలు
2011–16 మధ్య పంటబీమా పథకం అమలు దారుణంగా ఉందని కాగ్ దుయ్యబట్టింది.
న్యూఢిల్లీ: 2011–16 మధ్య పంటబీమా పథకం అమలు దారుణంగా ఉందని కాగ్ దుయ్యబట్టింది. ఎలాంటి పరిశీలన లేకుండానే ప్రైవేటు ఇన్సూరెన్సు కంపెనీలకు రూ.36,222.79 కోట్లు విడుదల చేశారని కేంద్ర ప్రభుత్వంపై మండిపడింది. ‘కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.32,606.65 కోట్లను పంటబీమా ప్రీమియం సబ్సిడీగా చెల్లించినట్లు పేర్కొన్నాయి. ఈ మొత్తం ప్రభుత్వ ఆధీనంలోని వ్యవసాయ బీమా కంపెనీ (ఏఐసీ) ద్వారా 10 ప్రైవేటు కంపెనీలకు చేరింది.
ఎలాంటి అనుమతి, మార్గదర్శకాల్లేకుండానే ఈ చెల్లింపులు జరిగాయి’ అని కాగ్ నివేదిక పేర్కొంది. 2011–12 నుంచి 2015–16 మధ్య కాలంలో ఎన్‌ఏఐఎస్, ఎమ్‌ఎన్‌ఏఐఎస్, వాతావరణ ఆధారిత పంటబీమా పథకం (డబ్ల్యూబీసీఐఎస్) పథకాలను కాగ్ సమీక్షించింది. కేంద్రం సరైన సమయంలోనే తన వాటా మొత్తాన్ని అందజేసినా రాష్ట్రాల వాటా రావటంలోనే ఆలస్యం జరిగిందని.. దీంతో రైతులకు సరైన సమయంలో పరిహారం అందలేదని పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది.