
బరేలీ: అమ్మాయి లక్షణాలున్న తనను అందరూ హిజ్రా అని పిలుస్తున్నారంటూ ఓ మైనర్ బాలుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం రాత్రి ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. చావుకు గల కారణాలు వివరిస్తూ రాసిన సూసైడ్ నోట్ అతడి గదిలో లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బరేలీలోని సుభాష్ నగర్‌కు చెందిన పదహారేళ్ల బాలుడు పదవ తరగతి చదువుతున్నాడు. సోమవారం అతని తండ్రి మార్కెట్ వెళ్లగా, సోదరుడు మరో గదిలో చదువుకుంటున్నాడు. ఈ సమయంలో అతను గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనా స్థలంలో పోలీసులకు ఆత్మహత్య లేఖ లభించింది. అందులో.. "నాన్న.. నేను మంచి కొడుకును కానందుకు నన్ను క్షమించు. నీలాగా నేను సంపాదించలేను. నా ముఖం అమ్మాయిలా కనిపించడమే కాక, అమ్మాయి లక్షణాలే ఎక్కువగా ఉన్నాయి. అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. (దారుణం: హిజ్రాలకు కరోనాతో ముడిపెట్టారు!)
నేను హిజ్రానా అని నాకూ అనుమానమేస్తోంది. నా వల్ల నీ జీవితం చీకటిమయం కాకూడదు. అందుకే చనిపోవాలని నిర్ణయించుకున్నా. మరో జన్మంటూ ఉంటే నేను అమ్మాయిగా పుట్టాలని నన్ను ఆశీర్వదించు. మన కుటుంబంలో ఆడపిల్ల పుడితే నేనే మళ్లీ జన్మించానని భావించండి" అని రాసుకొచ్చాడు. ఈ ఘటనపై బాధితుడి తండ్రి మాట్లాడుతూ.. "తన కొడుకు మామూలుగానే ఉండేవాడు. కానీ కొంతమంది వాడిని తప్పుగా అర్తం చేసుకుని కించపరుస్తూ మాట్లాడేవారు. అతడు తన తమ్ముడిని బాగా చూసుకునేవాడు. నేను లేనప్పుడు వంట కూడా చేసేవాడు. కొన్నిసార్లు మాత్రం స్త్రీలలాగా మేకప్ వేసుకుని డ్యాన్స్ చేసేవాడు" అని పేర్కొన్నాడు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌లాగా తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాడని మృతుడి సోదరుడు పేర్కొన్నాడు. (వలస కార్మికులపై బ్లీచ్ స్ప్రే)
Comments
Please login to add a commentAdd a comment