‘కెమెరా’ వివాదం ఎందుకు చల్లారింది?
- స్మృతి వ్యవహారంలో బీజేపీ కావాలనే అంటీముట్టనట్టు వ్యవహరించిందా
పణజి: గుడ్‌ఫ్రైడే రోజు దేశం దృష్టిని ఆకర్షించిన ఆ వివాదం ‘ఈస్టర్ సండే’కల్లా ఎందుకు చప్పున చల్లారింది? గోవాలోని ఫ్యాబ్ ఇండియా వస్త్ర దుకాణం ట్రయల్ రూంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ రహస్య కెమెరాను గుర్తించడంతో రోజంతా దానిపైనే తీవ్ర చర్చ జరిగింది. ప్రసార సాధనాలు దీనికి అత్యంత ప్రాముఖ్యం ఇచ్చాయి. కానీ సొంత ఎంపీ, కేంద్రమంత్రికి ఈ చేదు అనుభవం ఎదురవడంపై బీజేపీ నాయకత్వం పెద్దగా స్పందించలేదు.
ఈ వ్యవహారంలో అంటీముట్టనట్టుగానే వ్యవహరించింది. అదే రోజు (శుక్రవారం) బెంగళూరులో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమవడం ఇందుకు కారణమని మీడియాలో కథనాలు వచ్చాయి. సమావేశాలకు మీడియాలో దక్కాల్సిన ప్రాధాన్యాన్ని ఈ ‘కెమెరా’ వివాదం లాగేసుకుంటుందని భావించిన బీజేపీ.. కావాలనే దీనిపై అంతగా స్పందించలేదన్నది ఆ కథనాల సారాంశం. వాస్తవానికి శుక్రవారం స్మృతి ఇరానీ కండోలిమ్‌లోని ఫ్యాబ్ ఇండియాలో కెమెరాను గుర్తించగానే పోలీసులొచ్చి నలుగురు ఉద్యోగులను అరెస్టు చేశారు. షాపును సీజ్ చేశారు. కఠిన చర్యలు తీసుకుంటామంటూ గోవా సీఎం పార్సేకర్ దర్యాప్తునకు ఆదేశించారు.
తెల్లారేసరికి సీన్ మారింది!
కెమెరాల ఉదంతం వెలుగులోకి వచ్చిన తెల్లారే సీన్ మారింది. బీజేపీ సమావేశాలకు మీడియాలో ప్రాధాన్యం తగ్గిపోతుందని బీజేపీ నేతలు ఈ విషయానికి అంతగా ప్రాధాన్యం ఇవ్వకపోవడమే మంచిదని భావించారు. సీఎం పార్సేకర్ గొంతు సవరించుకున్నారు. ‘‘ రూంలోకి స్మృతి కంటే ముందు కొందరు మహిళలు వెళ్లారు. కావాలని కెమెరాలు పెట్టినట్టు లేదు. అనుకోకుండా అలా జరిగి ఉండొచ్చు’’ అని వ్యాఖ్యానించారు. గోవా పేరును చెడగొట్టవద్దంటూ మీడియాకు ఉచిత సలహా ఇచ్చారు. ఆ తర్వాత సీన్‌లోకి బీజేపీ అధికార ప్రతినిధి మీనాక్షి లేఖి వచ్చారు. ఈ ఘటనలో బీజేపీ వైఖరిని ఆమె పరోక్షంగా బయటపెట్టారు. ‘‘పనికిరాని అంశాలను ముందుకు తీసుకువచ్చి పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల ప్రాధాన్యం తగ్గించే ప్రయత్నం ఏమైనా జరుగుతోందా..’’ అని ఆమె ట్వీటర్‌లో పేర్కొన్నారు.
గోవాలోనూ గప్‌చుప్..
అదే రోజు గోవాలో కూడా ఈ ఘటన ప్రాధాన్యాన్ని తగ్గించి వేసే పరిణామాలు చకచకా చోటుచేసుకున్నాయి. ఈ కేసులో అరెస్టయిన నలుగురు ఫ్యాబ్ ఇండియా ఉద్యోగులకు స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.5వేల పూచీకత్తుతో వారికి బెయిలిచ్చింది. స్మృతి ఇరానీకి ఫ్యాబ్ ఇండియా క్షమాపణలు తెలిపింది. గోవా క్రైం బ్రాంచ్ పోలీసులు దుకాణంపై సానుకూలంగా స్పందించారు. షాపు ప్రతినిధులు తమకు సహకరిస్తున్నారని, తమ ముందు హాజరయ్యేందుకు కొంత సమయం అడిగారని ప్రకటించారు. అలా వివాదం శనివారం కల్లా కోమాలోకి వెళ్లిపోయింది!