రెండు నెలల నుంచి కెమెరాలు పెడుతున్నారట
ఎవరూ పట్టించుకోవటం లేదు
అడిగితే కర్రలతో కొడుతున్నారు
వీడియోలు చూపిస్తేనే పట్టించుకుంటారట
తన స్నేహితురాలికి ఫోన్‌చేసి ఏడ్చేసిన గుడ్లవల్లేరు కళాశాల విద్యార్థిని
సాక్షి, మచిలీపట్నం: గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలోని బాలికల హాస్టల్ వాష్‌రూమ్‌లో హిడెన్ కెమెరాల ఏర్పాటు ఘటనలో ఒక్కొక్క విద్యార్థినిదీ ఒక్కొక్క ఆవేదన. బంధువుల ఎదుట కొందరు తమ బాధను వెళ్లగక్కుతుండగా.. మరికొందరు స్నేహితులకు చెప్పుకుని కన్నీరు పెట్టుకుంటున్నారు. తాజాగా శనివారం ఓ విద్యార్థిని తన స్నేహితురాలికి ఫోన్ చేసి బాధతో ఏడ్చిన వాయిస్ బయటకు వచ్చింది. అందులో విద్యార్థిని చెప్పిన మాటలను పరిశీలిస్తే.. ‘ఆ అక్క ఎవరో తెలిసిందే. ఫోర్త్ ఇయర్ ఈసీఈ. ఆ అక్క ఫొటో కూడా చూశాం. ఆ అక్క అంటోంది రండి చూసుకుందాం అని. విత్ ప్రూఫ్‌లు ఉన్నాయని తెగేసి చెబుతోంది.
గ్రౌండ్ ఫ్లోర్, పై ఫ్లోర్‌లో ఏదేదో అంటున్నారే. భయం వేస్తోందే. రెండు నెలల నుంచి పెడుతున్నారట. 300 వీడియోలు బయటకు వచ్చాయంటా. అందరూ అడుగుతున్నారే భయం వేస్తోంది. మా ఫ్లోర్‌లోనూ పెట్టారట ఏడుపొస్తోంది. చచ్చిపోవాలనిపిస్తోందే బాబు. మేడంకు చెబితే బయటకు వస్తే డ్రగ్ కేసులో ఇరికిస్తామని అంటున్నారే. అలా.. ఇలా మాట్లాడుతున్నారే. రవీంద్రబాబేమో చూసి చెబుతాడంటే.. వీడియోస్ చూసినాక చెబుతాడంట. ఇప్పటికి 300 వీడియోలు బయటకు వచ్చాయని మాత్రం అంటున్నారు. సీనియర్స్ ధర్నా చేస్తున్నారు. సీనియర్స్ ఏమో గొడవ పెడుతున్నారు.
మేడమ్, వార్డెన్స్ కర్రలు పట్టుకుని వెంటపడుతున్నారు. కానీ సీనియర్స్ చాలామంది ఏడుస్తున్నారే. రెండు నెలలనుంచి జరుగుతోదంట. అవతలేమో పొలిటీషియన్స్ అంట. మరి తెలియట్లా. అందుకనే భయపడుతున్నారు అడగటానికి. ప్లీజే ఎవరి దగ్గరైనా వీడియో ఉంటే ఇక్కడ వీడియో ప్రూఫ్ చూపిస్తేనే మమ్మల్ని పట్టించుకుంటారంట. లేకపోతే పట్టించుకోరంట. అసలు ఏడుపొచ్చేస్తోంది మా ఫ్లోర్‌లోనే కెమెరా దొరికిందంటే. ఓసే వీడియో పెడితే ఏదైనా చేస్తారంటే. లేకపోతే ఏమీ చేయరంటే. అడుగుతుంటే కర్రలు పెట్టి కొడుతున్నారు. అంత ఉందే మా హాస్టల్‌లో సిట్యువేషన్. అందరూ ఏడుస్తున్నారు’ అంటూ ఆమె కూడా ఏడుస్తూ తన బాధను చెప్పుకుంది.
Comments
Please login to add a commentAdd a comment